3 March, 2026 | 2:25 PM

సామరస్యత కోసం జీవితాంతం కృషిచేసిన మహానీయుడు సంతు రవిదాస్

03-03-2026 12:14 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు

కామారెడ్డి, మార్చి 2(విజయక్రాంతి): సామరస్యత కోసం జీవితాంతం కృషి చేసిన మహానీయుడు సంతు రవిదాస్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు అన్నారు. సోమవారం కామారెడ్డిలో సంతు గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల క్యాలెండర్ లను, పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ సంతు రవిదాస్ ఆధ్యాత్మిక గురువుగా సమాజానికి మార్గదర్శకులని కొనియాడారు.

సమానత్వం, సోదర భావం, మానవత్వం విలువలను ఆయన బోధించారని తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు మాట్లాడుతూ సమరసత కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు సంత్ రవిదాస్ అని పేర్కొన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజ నిర్మాణం చేయడమే ఆయన ఆశయమని అన్నారు.

సామాజిక సమరసత అఖిల భారత కళా విభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ సంత్ రవిదాస్ బోధించిన సమానత్వం, మానవత్వం నేటి సమాజానికి అత్యంత అవసరమని తెలిపారు. ఆయన జీవితం సామాజిక న్యాయం, సోదరభావం, సేవా భావానికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు. సంత్ రవిదాస్ చర్మకార వృత్తిని నిబద్ధతతో ఆచరిస్తూనే పరమాత్మ నామస్మరణలో నిమగ్నమైన ఆస్తిక మహనీయుడు.

శైవవైష్ణవ భేదాలు చూపకుండా అందరిలోనూ భగవంతుని దర్శించిన మహాత్ముడు. రెండు జతల పాదరక్షలు తయారు చేసి ఒక జతను తీర్థయాత్రలకు వెళ్లే సాధువులకు దానం చేసి, మరొక జతను జీవనోపాధికి వినియోగించే త్యాగమూర్తి అని ప్రసంగకర్తలు వివరించారు. స్వామి రామానంద ఆశీస్సులతో భక్తి ఉద్యమాన్ని ముందుకు నడిపిన సంత్ రవిదాస్, కబీర్ దాస్ వంటి మహనీయులతో సమకాలీనుడిగా ఉన్నారని తెలిపారు.

అలాగే సిక్కు మత ప్రవర్తకుడు గురు నానక్ కు సమకాలికుడని చెబుతారు. సిక్కుల ఆరాధ్య గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ లో 40కి పైగా పద్యాలు సంత్ రవిదాస్ రచించినవే అని వివరించారు.కులం కన్నా గుణం మిన్న అనే సందేశంతో వివక్షతలేని సమాజ నిర్మాణానికి ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు పరస్పరం ప్రేమాభిమానాలతో జీవించాలని ఆయన బోధనల సారాంశమని అన్నారు.

ఫిబ్రవరి 2026 నుంచి జనవరి 2027 వరకు దేశవ్యాప్తంగా సంవత్సరం పొడవునా సంత్ రవిదాస్ 650వ జయంతి ఉత్సవాలను కుటుంబాలు, విద్యార్థులు, ప్రజలతో నిర్వహించి సమాజంలో సమరసత నిర్మాణానికి కృషి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు అమృత రాజేందర్, విభాగ్ సహా సంయోజక్ బాల్ రాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మన్నె కృష్ణ, మహిళా కన్వీనర్ సోలంకి రవళి, నగర సంయోజక్ దత్తు రావు, కృష్ణమూర్తి, నల్ల నాగభూషణం, మోచి కుటుంబ సభ్యులు జజారి బల్ రామ్, హరి బాబు, కదం బల్ రామ్, మధు, మణికర్ రాజు, శంకర్ పాల్గొన్నారు.