21 నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు
- జూన్ 1వ తేదీ వరకు నిర్వహణ
- దాదాపు 40 లక్షల మంది హాజరవుతారని అంచనా
- ఏర్పాట్లను సమీక్షించిన మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి) : కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే సరస్వతి అంత్య పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ తెలిపారు. శనివారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం లో సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. 21వ తేదీ ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠం స్వామి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ పుణ్యస్నానం ఆచరించి పుష్కరాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. పుష్కరాలకు 30 నుంచి 40 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా కాళేశ్వరం ఆలయంలో దర్శనాలు, పీఠాధిపతులకు ఏర్పా ట్లు, పుష్కరఘాట్‌ల వద్ద పారిద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాని స్పష్టం చేశారు.
మేడారం జాతర స్ఫూర్తితో పుష్కరాలు : కొండా సురేఖ
మేడారం జాతర స్ఫూర్తితో సరస్వతి అంత్య పుష్కరాలను నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. ప్రతి రోజూ ఒక ప్రముఖ పీఠం స్వామి జీ పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం ఆచరిస్తారని తెలిపారు. అంత్య పుష్కరాల అనుభవం రానున్నగోదావరి పుష్కరాలకు ఉపయోగపడుతుందన్నారు. సీఎస్ రామకృష్ణారావు మాట్లా డుతూ.. శానిటేషన్, ట్రాఫిక్, ప్రొటోకాల్, రవా ణా, తాగునీటికి సంబంధించిన ఏర్పాట్లు పక్కా గా ఉండాలని అధికారులను ఆదేశించారు.
పుష్కరాలను ప్రారంభించనున్న కంచి కామకోటి పీఠాధిపతి, హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్
దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ పుష్కరాల్లో ప్రతి రోజూ హోమాలు, ఘాట్ వద్ద హారతి, తెప్పోత్సవం ఉంటుందన్నారు. అంత్య పుష్కరాల్లో మొదటి రోజు కంచి కామకోటి పీఠం స్వామీజీ జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీతో పాటు గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుణ్యస్నానాలు ఆచరిస్తారన్నారు. ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు వివరించారు.






