17 May, 2026 | 1:07 AM

సరస్వతి అంత్య పుష్కరిణి కాళేశ్వరం

17-05-2026 12:00 AM

(మహబూబాబాద్, విజయక్రాంతి): రాష్ట్రంలో ఆధ్యాత్మిక చరిత్రలో అరుదైన  ఘట్టంగా నిలవనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు జయశంకర్ జిల్లా భూపాలపల్లి కాళేశ్వరంను సర్వాంగ సుందరం గా తీర్చిదిద్దుతున్నారు. గోదావరి ప్రాణహిత అంతర్వాహిని సరస్వతి త్రివేణి నదికి పుష్కరాలు నిర్వహించే ఆనవాయితీ ఉంది.

బృహస్పతి మిధున రాశిలో ప్రవేశించే సందర్భంలో సరస్వతీ నదికి పుష్కరాలు నిర్వహించే ఆనవాయితీ ఉంది. మే 21 నుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరాలు, చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా నిర్వహిస్తారు. త్రివేణి సంగమంగా పేరొందిన కాళేశ్వరం వద్ద ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో పుష్కరాల సమయంలో పుష్కర స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని భక్తుల నమ్మకం. 

కాళేశ్వరం క్షేత్ర విశిష్టత

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం దేశంలో అరుదైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఒకే పానవట్టంపై కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు వెలిసి ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. గోదావరి తీరాన ఉన్న ఈ క్షేత్రం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజులపాటు జరగనున్న సరస్వతి అంత్య పుష్కర మహోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ మహా ఆధ్యాత్మిక వేడుకలకు సుమారు 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. 027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ఆలయ ప్రాంత అభివృద్ధికి ఇప్పటికే రూ.198 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈసారి జరిగే సరస్వతి అంత్యపుష్కరాలు భవిష్యత్ మహా పుష్కరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అధికారులు చెబుతున్నారు.

పుష్కరాల ప్రధాన ఘట్టాలు

సరస్వతి అంత్యపుష్కరాలు మే 21 ఉదయం 5:43 గంటలకు తొలి పుష్కర స్నానంతో ప్రారంభమవుతాయి. త్రివేణి సంగమంలో కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కర స్నానం ఆచరిస్తారు. ప్రతి రోజు సాయంత్రం కాశీ పండితుల ఆధ్వర్యంలో గోదావరి మహా హారతి, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. పుష్కర హారతి, పుణ్య స్థానాలు, గంగా పూజ, గోపూజ, నది హారతి, ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకం, విద్యార్థులకు అక్షరాభ్యాసాలు, వేద పండితుల ఉపన్యాసాలు, మహిళల కుంకుమా ర్చనలు,

త్రివేణి సంగమ ప్రత్యేక స్నానాలు, పితృ తర్పణా లు, పిండ ప్రధానాలు, హరికథ, భజనలు, శివపార్వతుల కళ్యాణోత్సవం, ఆలయ ప్రదక్షిణలు, సాంస్కృతిక, కళా బృం దాల ప్రదర్శనలు, మహాన్యాస పూర్వాక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక హారతులు, విద్యార్థుల వేద పఠన పోటీలు, ధార్మిక సదస్సులు, పురాణ ప్రవచనాలు, రథోత్సవం, నృత్య ప్రదర్శనలు, జానపద కళా ప్రదర్శనలు, సర్వదేవతా హోమా లు, సత్యనారాయణ వ్రతాలు, దీపోత్సవం, పుష్కర తీర్థ ప్రదక్షణ, గోదావరి, ప్రాణహిత సంగమ హారతి, ఆధ్యాత్మిక సభలు, మహా పూర్ణాహుతి, విశేష నదిహారతి, అంత్యపుష్కర ముగింపు వేడుకలు, మహా మంగళ హారతి, వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాద పంపిణీ, పుష్కర సమాప్తి కార్యక్రమాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రూ.30 కోట్లతో వేడుకల నిర్వహణ ఏర్పాట్లు

పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.21.38 కోట్ల నుంచి రూ.30.63 కోట్ల వరకు నిధులు విడుదల చేసి 162 అభివృద్ధి పనులను చేపట్టింది. ముఖ్యంగా త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక ఘాట్ల నిర్మాణం, వీఐపీ ఘాట్ అభివృద్ధి, పోచమ్మ గుడి నుంచి వీఐపీ ఘాట్ వరకు రోడ్డు విస్తరణ, ముక్తేశ్వర ఆలయం పరిసరాల్లో సీసీ రోడ్లు నిర్మించారు. అలాగే తాత్కాలిక టెంట్ సిటీలు, వసతి కేంద్రాలు, పారిశుధ్య, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల వాహనాల కోసం 250 ఎకరాల్లో భారీ పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రముఖుల రాక కోసం ప్రత్యేక హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

భక్తుల కోసం ప్రభుత్వం పలు విభాగాలను సమన్వయంతో పనిచేయమని ఆదేశించింది. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఆరోగ్య, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీటి ట్యాంకర్లు, ఉచిత వైద్య సేవలు, భక్తులకు సమాచారం అందించే హెల్ప్‌డెస్కులు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, భక్తులు ఆన్లైన్ ద్వారా వసతి, పూజా సేవలు బుక్ చేసుకునే అవకాశాలు కూడా కల్పిస్తున్నారు.

ప్రముఖుల రాక

పుష్కరాల ప్రారంభోత్సవానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, సీఎం అనుముల రేవంత్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పలు మఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు పాల్గొననున్నారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు

సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా 12 రోజుల పాటు ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం పుష్కర స్నానాలు ఆలయ ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, హోమాలు, వేదపారాయణాలు సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు నదీ హారతి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు, శృంగేరి శారదా పీఠ పౌరాణికులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ద్వారా ‘పుష్కర వైభవం’ ప్రవచనాలు,మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ఉపన్యాసం, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ ప్రవచనం నిర్వహించనున్నారు. పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు పాల్గొననున్నారు.

బండి సంపత్ కుమార్