ధరణి సమస్యలపై సర్కారు నజర్
- ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
కలెక్టర్లకు ఇప్పటికే సీసీఎల్‌ఏ ఆదేశాలు
పెండింగ్ దరఖాస్తుల పట్ల అసహనం
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): ధరణి సమస్యల పరిష్కారంపై సర్కారు ప్రధాన దృష్టి కేంద్రీకరించింది. పెండింగ్ దరఖాస్తులను అన్నింటినీ క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించింది. సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. జూన్ 14న అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సర్కారు లక్ష్యాన్ని వివరించారు. ధరణిపై వచ్చిన వినతులు ఒక్కటి కూడా పెండింగ్‌లో ఉండకూడదంటూ సూచించారు. అన్ని సమస్యలను రెండువారాల్లోగా పరిష్కరించాలని గడువు విధించారు. అయితే, కొందరు రెవెన్యూ అధికారులు సీసీఎల్‌ఏ ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ పెద్దమొత్తంలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంపై సీసీఎల్‌ఏ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ దృష్టికి వెళ్లడంతో రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్ దరఖాస్తుల వివరాలు తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్లకు డ్యాష్‌బోర్డుపై కన్పిస్తున్నా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించడంతో రెవెన్యూ అధికారులు నీళ్లు నమిలినట్లు సమాచారం. కలెక్టర్లపై కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారం రోజుల్లోగా అన్ని దరఖాస్తులు పరిష్కారం కావాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నవీన్‌మిట్టల్ హెచ్చరించినట్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ నెల 14వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఈ నెల 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల 782 దరఖాస్తులు పరిష్కారం కాగా, ఇంకా 2,34,626 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. వీటిలో తహసీల్దార్ల వద్ద 1,48, 182, ఆర్డీవోల వద్ద 53, 478, అడిషనల్ కలెక్టర్ల వద్ద 20,461, కలెక్టర్ల వద్ద 12,505 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ధరణికి సంబంధించిన దరఖాస్తులు 13, 513 రాగా, వీటిలో 4,557 మాత్రమే పరిష్కరించగా ఇంకా 8956 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ తాజా హెచ్చరికలతో సోమవారం నుంచి రెవెన్యూ అధికారులు ధరణి సమస్యలపైనే ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.






