గూడెం వాటర్ ప్లాంట్ ప్రారంభించిన సర్పంచ్
బెజ్జంకి, మే 7: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను గురువారం గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, గ్రామస్తుల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
గ్రామంలో చాలా కాలంగా ఉన్న తాగునీటి సమస్యకు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా శాశ్వత పరిష్కారం లభించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.గ్రామ ప్రజలు కూడా ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాలాల పర్శరాములు, వార్డు సభ్యులు బోనాల రమేశ్, మంకాల సుగుణ, బోనాల లక్ష్మీ, నూనె రవి, నారెడ్డి శ్రీనాథ్, గూడెల్లి స్వప్న, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, గ్రామ పెద్దలు, యువకులు , గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






