రత్నాపూర్ గ్రామ అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందించాలి
ఖిల్లా ఇండస్ట్రియల్ పార్కులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి
మంత్రి శ్రీధర్ బాబుకు సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు వినతి
రామగిరి, జూలై 27 (విజయక్రాంతి): రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక సహకారం అందించడంతో పాటు రామగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కులో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలని రత్నాపూర్ గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సోమవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ కోరారు. అలాగే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో స్థానిక యువతకు అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
వినతిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందిస్తూ రత్నాపూర్ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామంలో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా స్థానిక యువతకు ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. మంత్రి ఇచ్చిన హామీతో రత్నాపూర్ గ్రామాభివృద్ధికి మరింత ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సర్పంచ్ ప్రతిమ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామ ప్రతినిధులు పాల్గొన్నారు.






