23-11-2025 03:59:23 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస గార్డెన్ లో శివ సాయి గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో సత్యసాయి బాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం శివ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 26 మంది నిరుపేదలకు కుట్టు మిషన్లు, 50 మందికి దుప్పట్లు, ఆరుగురికి అమృత కలశాలను ప్రముఖ న్యాయవాది కేవీ ప్రతాప్, శివ సాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాటిబండ శ్రీరామ్మూర్తి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అందజేశారు.
ఈ సందర్భంగా కేవీ ప్రతాప్ మాట్లాడుతూ... శివ సాయి గణేష్ సేవ సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు కుట్టు మిషన్లు, దుప్పట్లు, అమృత కలశాలు అందజేయడం అభినందనీయమని శివ సాయి గణేష్ సేవాసమితి సభ్యులను కమిటీని అభినందించారు. సత్యసాయి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మండలంలోని మారుమూల గ్రామంలో నిరుపేదలకు విద్య, ఆరోగ్యంపై శివ సాయి గణేష్ సేవా సమితి గణేష్ సేవాసమితి కమిటీ దృష్టి పెట్టాలని సూచించారు. సత్యం, ధర్మం, ప్రేమ అనే విలువలను సమాజంలోకి తీసుకెళ్లి ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివ సాయి గణేష్ సేవాసమితి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.