25 April, 2026 | 1:54 AM

ఆలయాల నిర్మాణాలకు సతీష్ కుమార్ పెద్దపీట

25-04-2026 12:22 AM
  1. శ్రీ గంగమ్మ- చౌడాలమ్మ ఆలయ నిర్మాణానికి ఆరు గుంటల భూమి కేటాయింపు
  2. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్ సేవలను గుర్తించిన యాదవ సంఘం
  3. ఉదార స్వభావం, మానవత్వం కలిగిన నాయకుడికి శాలువాతో ఘన సన్మానం మహోత్సవానికి ఆహ్వానం

హుస్నాబాద్, ఏప్రిల్ 24: హుస్నాబాద్ నియోజకవర్గస్థాయిలో ఆలయాల నిర్మాణాలకు మాజీ శాసనసభ్యుడు వొడితల సతీష్ కుమార్ ఎంతో కృషి చేశారని అక్కన్నపేట మండల కేంద్రంలో యాదవుల ఆరాధ్య దైవాలైన శ్రీ గంగమ్మ తల్లి, శ్రీ చౌడాలమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఆరు గుంటల భూమి కేటాయింపునకు కృషి చేసి సాధించిన ఘనత ఆయనదేనని యాదవ సంఘం నాయకులు అన్నారు.

అక్కన్నపేట మండల కేంద్రంలో స్థానిక యాదవుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి ఆరు గుంటల భూమి కేటాయింపుతో పాటు వ్యక్తిగతంగా 400 సిమెంట్ బస్తాలు అందజేసి తన సేవాభావాన్ని చాటుకున్న నాయకుడిగా కొనియాడారు. శుక్రవారం హన్మకొండలోని మాజీ ఎమ్మెల్యే వి. సతీష్ కుమార్ నివాసంలో యాదవ సంఘం ప్రతినిధులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, అక్కన్నపేట మండల కేంద్రంలో జరగనున్న శ్రీ గంగమ్మ-చౌడాలమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ఉత్సాహం, సామాజిక ఐక్యత, కృతజ్ఞతాభావం కలిసిన అరుదైన దృశ్యం కనిపించింది. అక్కన్నపేట మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ పెసర సాంబరాజు మాట్లాడుతూ.. యాదవుల ఆరాధ్య దేవతల ఆలయ నిర్మాణానికి శాశ్వత పరిష్కారంగా భూమి కేటాయింపునకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్కే దక్కుతుందని అన్నారు. ఆలయం నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం స్థానిక భక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తుండగా, ప్రజా ప్రతినిధిగా స్పందించి ప్రభుత్వ స్థాయిలో ఆరు గుంటల భూమి కేటాయింపునకు ప్రత్యేకంగా కృషి చేశారని తెలిపారు.

అంతేకాకుండా ఆలయ నిర్మాణం వేగవంతం కావాలనే సంకల్పంతో వ్యక్తిగతంగా 400 సిమెంట్ బస్తాలు అందజేసి తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారని పేర్కొన్నారు. ప్రజా సేవను రాజకీయాలకే పరిమితం చేయకుండా, అవసరమైన చోట సహాయం చేయడమే తన ధ్యేయంగా ముందుకు సాగే గొప్ప నాయకుడిగా ఆయన నిలిచారని అన్నారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి. సతీష్ కుమార్ మానవత్వం కలిగిన నాయకుడిగా, అందరినీ సమానంగా ఆదరించే వ్యక్తిత్వం కలిగిన గొప్ప మేధావిగా ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మండలంలోని పలు కుల సంఘాలకు చెందిన ఆలయాల నిర్మాణాలు, కమ్యూనిటీ భవనాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా విశేష సహకారం అందించారని గుర్తు చేశారు. ప్రజల సమస్యలపై అవగాహనతో, పరిష్కార దృక్పథంతో పనిచేసే నాయకత్వం సతీష్ కుమార్ ప్రత్యేకత అని కొనియాడారు. ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు అక్కన్నపేట మండల కేంద్రంలో మూడు రోజుల పాటు శ్రీ గంగమ్మ తల్లి, శ్రీ చౌడాలమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

గణపతి పూజలు, యాగశాల కార్యక్రమాలు, హోమాలు, దేవతా ఆవాహన, మహాస్నపన, విగ్రహ ప్రతిష్ఠాపన, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ వంటి పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే వి. సతీష్ కుమార్ హాజరవుతారని, వేలాదిగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం మాజీ అధ్యక్షులు చెవుల సదయ్య, మాజీ వార్డు సభ్యురాలు తనుగుల పుష్పలత సదయ్య, మొదటి వార్డు సభ్యుడు వల్లపు రాజు, మాజీ ఎంపీటీసీ కందుల రామ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.