సత్య సంధత
‘సత్యం జ్ఞానం అనంతం.. బ్రహ్మ’ అని వేదం బ్రహ్మం స్వరూప లక్షణాలలో ‘సత్యం’ (Truth) ఒకటని చెప్పింది. ‘సత్యం వద, ధర్మం చర.. ‘సత్యాన్ని అనుష్ఠించు, ధర్మాన్ని రక్షించు’ అని ఉపనిషద్ వాక్యం. ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలు నాలుగని చెప్పారు కదా. ‘అత్యంత ప్రధానమైన సత్యాన్ని వదిలేశారేమిటి?’ అనే సందేహం వస్తుంది. ఈ సందేహాన్ని ‘బృహదారణ్యకోపనిషత్తు’లోని ఈ మంత్రం నివృత్తి చేస్తుంది.
తస్మాత్సత్యం వదంతమాహుర్ధర్మం
వదతీతి ధర్మం వా వదంతం
సత్యం వదతీత్యేతద్ధ్యేవైత
దుభయం భవతి ॥ (1.4.14)
‘సత్యం పలికేవాడిని ధర్మం పలుకుతున్నాడని, ధర్మం పలికేవాడిని సత్యం పలుకుతున్నాడని’ అంటారు. కనుక, ఆ రెండిట్లో ఏ ఒక్కదాన్ని చెప్పినా, రెండిటినీ చెప్పినట్లే. న్యాయస్థానంలో అసత్యం పలికితే అది ధర్మం కాదుకదా! అందువల్ల, ధర్మం సత్యం ఒకే నాణానికి రెండు వైపులని గుర్తించాలి. ‘ముండకోపనిషత్తు’లోని సత్యసంధత ఆర్ష సంప్రదాయంలో ప్రధానాంశం అని గుర్తించిన స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులలోని నాయకులు ‘సత్యమేవ జయతే’ అనే సూక్తిని భారత ప్రభుత్వ అధికార ముద్రలో ఉంచారు. సత్యసంధత మీద వారికున్న గౌరవానికి భద్రమస్తు! ఆ మంత్రం ఇలా ఉంది.
సత్యమేవ జయతే నానృతం
సత్యేన పన్థా వితతో దేవయానః
యేనాక్రమన్తి ఋషయోహి
ఆప్తకామా యత్ర తత్సత్యస్య
పరమం నిధానమ్॥ (3.1.6)
‘సత్యం గెలిచి తీరుతుంది. అసత్యం ఎన్నటికి గెలవదని’ దీనర్థం. సత్యమే పలకాలనేది మన ధర్మమే అయినా అలా ఉన్నది ఉన్నట్టు సత్యమే పలికితే ఇతరులకు హాని కలుగవచ్చు. అటువంటి సందర్భాలలో అనృతం పలికినా తప్పు లేదని మన పురాణాలు, ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఇది ధర్మసూక్ష్మం. ‘సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్’ సత్యం పలుకు, ఆ పలికేది నొప్పి కలుగ జేయకుండా పలుకు. అప్రియమైంది సత్యమైనా పలుక వద్దు. ‘అలాగని అవతలి వాణ్ణి వశం చేసుకోవడానికి అతణ్ణి గురించి అసత్యమైన ప్రియ వచనాలు పలక కూడదు’ అని ఆర్యోక్తి.
ఏ సందర్భాలలో అసత్యం పలికినా దోషం అంటుకోదో ‘మహాభారతం’లో ఇలా వివరించడం జరిగింది.
క. చను బొంకఁగఁ బ్రాణాత్యయ
మున, సర్వధనాపహరణమున,
వధ గావచ్చిన విప్రార్థమున, వధూ
జన సంగమమున, వివాహ
సమయ ములందున్ ॥ 1.3.178
ప్రాణాలకు నాశం కలిగే సమయాన, సమస్త ధనం అపహరణకు గురయ్యే సమయాన, వధించడానికి సిద్ధంగా ఉన్న బ్రాహ్మణుడిని రక్షించేందుకు, స్త్రీజన సమాగమ విషయాన, పెళ్ళి వేళలందు అసత్య మాడవచ్చు. ఈ విషయమే ‘భాగవతం’లో ’వారిజాక్షులందు వైవాహికములందు, ప్రాణ విత్తమాన భంగమందుఁ, జకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు, బొంకవచ్చు నఘముఁబొందఁడధిప!’ అనే పద్యంలో చెప్పడం జరిగింది. సత్యవాక్యం విశిష్టతను ‘మహాభారతం’ ఇలా శ్లాఘించింది.
చ. నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత ప్రత! యొకబావి మేలు; మరి బావులు నూఱిటికంటె నొక్కస త్రతుపవది మేలు; తత్కృతుశతంబునకంటే సుతుండు మేలు; తత్సుత శతకంబుకంటె నొక నూనృతవాక్యము మేలు సూడఁగన్.






