26-07-2024 02:30:00 AM
ఎక్కువ కాలం జీవించాలన్న ఆశ, మృత్యువు ముంచుకొస్తుందేమో అన్న భయం మనిషిని యాతన పెడుతుంటాయి. కానీ, మరణం అనివార్యం! మృత్యువును సైతం దేవతగా భావిస్తుంది భారతదేశం! మరణాన్ని జయించటం అంటూ లేదు. మృత్యు భావనను జయించటం అసాధ్యం కాదు. ఈ జయం సిద్ధించిన తరువాత శరీరాన్ని వదిలిపెట్టే వేళలు, నిశ్చలానంద స్థితిని అనుగ్రహిస్తాయి. అదే, అనాయాస మరణం. ఈ భావనతో జీవించటమే దైన్యం లేని జీవితం. సనాతన ధర్మం అగ్నిని, వాయువును దైవాలుగా భావించమని బోధిస్తుంది.
అట్లాగే, మరణాన్ని కూడా! ఇంతకీ మృత్యుదేవత ఎవరు? యుముడే! ఆయనే యమధర్మరాజు. యమధర్మంలో సంక్లిష్టత లేదు. అంతా సరళమే! సూటిదనమే! ఎవరిపట్లా అపేక్ష, ఉపేక్షలు లేని సమవర్తి యముడు. మరణ రహస్యాన్ని తెలుసుకోవాలన్న నచికేతసుడికి యముడు బోధించినదంతా ఆత్మపరమే! మృత్యు రహస్యాన్ని తార్కికంగా, స్పష్టంగా, గంభీరంగా విప్పి, విశద పరచిన వైనమే ఉపనిషత్తుగా మనకు లభించింది.
పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకు రావటమనే భ్రమ నుండీ, జీవించి ఉండగానే మరణ భయం నుండి బయటపడి, జీవన్ముక్తుడి వలే జీవించ గలగటం, సాధన ద్వారా సాధ్యమేనని అభయ వరదానం చేసే ఈ ఉపనిషత్ ‘కఠోపనిషత్’గా లోక ప్రసిద్ధం! గడ్డివామిలో సూదిని పట్టుకోవటానికి ఎంత శ్రమ పడాలో, మృత్యుంజయత్వం సిద్ధించుకోవటం వెనుక అంతకు మించిన శ్రమ ఉన్నది. మరణ దేవతే స్వయంగా చేసిన బోధగా ‘కఠోపనిషత్’ను అజరామరం చేసింది.
భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇంతటి మహాస్థితిని అనుభవించి, జీవన్ముక్తులుగా, ఆ అనుభవం పొందిన నాటినుండీ అదే దేహంలో, మనముంటున్న ఇదే ప్రపంచంలో 54 సంవత్సరాలు నిలకడ చెందటం ఒక నిరుపమాన సందర్భం! దేహాన్ని వదిలినా, అనుగ్రహ చైతన్యంగా ఇప్పటికీ లోకానికి రమణులే ఒక ఆధ్యాత్మిక అనుభవం! ఈ పరంపర అవిచ్ఛిన్నమైంది!
అరుణాచల స్మరణమే పరముక్తిని వరదానం చేస్తుందని భగవాన్ సాధనా మార్గాన్ని సరళ గంభీరంగా సూచించారు. అందుకోసం వారు ఆత్మ విచార మార్గా న్ని నిర్దేశించి ‘నేనెవరు?’ అన్న ప్రశ్నను సంధించుకోమన్నారు. తమస్సును వీడి తపస్సును, వేద ప్రచోదితమైన కర్మమార్గాన్ని సమన్వయం చేసుకుని, జీవితాన్ని మరణభయం లేకుండా జీవించమని బోధించారు. తమ జీవన విధానంతో దానిని సోదాహరణం చేశారు.
అభినవ వేదం
నచికేతసుడు మృత్యుదేవతతో సాగించిన సంవా దం, అభినవ వేదమై నచికేతాగ్నిగా వెలుగుతూనే ఉన్నది. తండ్రి ఆజ్ఞను అనుసరించి, యజ్ఞఫలం తండ్రికి సంపూర్ణంగా లభించాలని నచికేతసుడు యమలోకానికి వెళ్ళటం, ఆ సమయంలో అక్కడ యముడు లేని కారణంగా మూడు రాత్రులు నిద్రాహారాలు మాని నిరీక్షించటం, ఆపై యముడు రావటం, నచికేతసుడిని మూడు వరాలు కోరుకొమ్మని అనటంతో సంభాషణ ప్రారంభమవుతుంది.
ఆ కారణంగా నచికేతసుడు, తన లోకానికి తాను తిరిగి వెళ్లినప్పుడు తన తండ్రి తనను గుర్తించాలని; తన గురించి తన తండ్రికి ఎట్టి విచారం కలుగకూడదని; అగ్నివిద్యను ఉపదేశం చేయమని కోరుకుంటాడు. ‘మరణానంతరం జీవుడు ఉండడా? ఉంటాడా?’ అన్న విషయాన్ని బోధించమని అన్నప్పుడు దయామయుడైన యముడు బోధించిన ఆత్మతత్వమే కఠోపనిషత్. కర్మాచరణ, తత్వవిచారణ, యోగాభ్యసనం, ఈశ్వరార్పణ బుద్ధి, సమర్పణ, ఆత్మ విచారం, మోహ క్షయాన్ని అనుగ్రహించి కాలపాశం నుండి విముక్తి కలిగించే సాధనా మార్గాలను స్పష్టంగా వివరించే కఠోపనిషత్ గంభీరమైంది. కేవలం వాచ్యార్థంగా కాక యదార్థమైన, నిత్యసత్య శాశ్వతమైన ఆత్మను ఎలా ఎరగాలో ఈ ఉపనిషత్ మనకి బోధిస్తూ నెమ్మదిగా మరణ రహస్యాన్ని విప్పి చెబుతుంది.