ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను కాపాడండి
అద్దె నిధులు విడుదల చేయాలని సీపీఎం డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 23(విజయక్రాంతి): తెలంగాణలో కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు అద్దె నిధులను విడుదల చేయాలని సీపీఎం కార్యదర్శి ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, అనేక నెలలుగా అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో భవన యజమానులు బలవంతంగా తాళాలు వేసి మూసివేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే మిర్యాలగూడ, బీబీనగర్, మేడ్చల్, బొల్లారం, షామీర్‌పేట డిస్పెన్సరీలు మూతపడగా తర్వలో మరికొన్ని మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. డిస్పెన్సరీలు మూతపడటంతో కార్మికుల వైద్యసేవలు ఆటంకం కలుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్‌ఐ డిస్పెన్సరీల అద్దె బకాయిలు రూ.2.10 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ అద్దె బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మూతపడిన డిస్పెన్సరీలను వెంటనే తెరవాలని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.






