20 August, 2026 | 2:23 AM

సేవ్ పాలిటెక్నిక్.. సేవ్ ఎస్‌బీటీఈటీ

20-08-2026 12:52 AM
  1. ఆందోళన బాట పట్టిన పాలిటెక్నిక్ విద్యార్థులు
  2. కాలేజీల విలీనాన్ని ఆపాలి
  3. ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చదవాల్సిందేనా? 
  4. ప్రభుత్వానికి విద్యార్థుల ప్రశ్నలు
  5. జీవో నెం.97ను రద్దు చేయాలి: పీఎస్‌యూ
  6. నేడు పాలిటెక్నిక్ కాలేజీ బంద్: ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్త ంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. సేవ్ పాలిటెక్నిక్..సేవ్ ఎస్‌బీటీఈటీ (సాంకేంతిక విద్యా, శిక్షణ మండలి) అంటూ రోడ్లపై బైఠాయించారు. ప్లకార్డులు పట్టుకొని కాలేజీల ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్, ఐటీఐ, ఏటీసీలను విలీనం చేచొద్దని, జీవో నెం.97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినదించారు.

శక్తి పాలసీ వల్ల తమ మూడేళ్ల చదువంతా వృథాయేనా?, ఇప్పుడు తా ము ఇంజనీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేయాలా?, ల్యాటర్ ఎంట్రీ ద్వారా నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ఇక వెళ్లడం కష్టమేనా? అంటూ ప్రభుత్వంపై విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం భారీ స్థాయిలో విద్యార్థులు పలు జిల్లాల్లో రోడ్లపైకొచ్చి నిరసనలు తెలిపారు.

పలు జిల్లాలతోపాటు హైదరాబాద్ షేక్‌పేట లెదర్ టెక్నాలజీ పాలిటెక్నిక్ (గచ్చిబౌలి సమీపం) కళాశాల వద్ద సైతం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్ర మం చేపట్టారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వం జూలై 3న నిశబ్దంగా జారీ చేసిన జీవో నెం.97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్‌లను స్కిల్ యూనివర్సిటీలో విలీన ప్రక్రియను ఆపేయాలని విద్యార్థులు, ఉద్యోగులు కోరారు.

 ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయంతో దశాబ్దాలుగా ఎస్‌బీటీఈటీ స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని, డిప్లొమాను సాధారణ శిక్షణగా మారుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా  సొంత నిధులతో నడుస్తున్న సాంకేతిక విద్యామండలి అధికారాలను ఎందుకు లాగే సుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. 

పాలిటెక్నిక్‌లను ఐటీఐ, ఇతర స్వల్పకాలిక స్కిల్ కోర్సులతో సమానంగా మార్చడం ద్వారా డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సుల విలువ తగ్గిపోతుందని, దీనివల్ల విద్యార్థులకు ఉపాధి, ఉన్నత ఉద్యోగ అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రైవేటీకరణను ఆపాలి: పీఎస్‌యూ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల స్వయంప్రతిపత్తిని పూర్తిగా దెబ్బతీస్తూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని ప్రోగ్రెసివ్ స్టూడె ంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు తెలిపారు. సాంకేతిక విద్యామండలి పరిధి నుంచి పాలిటెక్నిక్‌ను తొలగించి, కొత్తగా ఏర్పాటు చేసిన ‘శక్తి’ విభాగానికి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి విలీనం చేయడం విద్యావ్యవస్థను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడమేనని పేర్కొన్నారు.

పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న బీటెక్ రెండో సంవత్సరంలో చేరే అవకాశం లేకుండా పోతుందన్నారు. విద్యార్థులను కేవలం కార్పొరేట్ సంస్థలకు అవసరమైన శ్రామికులుగా మార్చేలా ప్రభుత్వం ఈ విలీన నిర్ణయం తీసుకోవడం సరికాదన్నా రు. సాంకేతిక విద్యను పూర్తిగా ప్రైవేటీకరించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకు న్నారని విమర్శించారు. దీనివల్ల ఫీజులు విపరీతంగా పెరిగి, నిరుపేద విద్యార్థులకు భార మవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, పాలిటెక్ని క్ విద్యా వ్యవస్థను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ప్రతిపాదన ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, వి ద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను సాంకేతిక వి ద్యామండలి పరిధిలోనే కొనసాగించాలని ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 

నేడు పాలిటెక్నిక్ కాలేజీల బంద్

పాలిటెక్నిక్‌లను విలీనం చేయొద్దని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా రు. ఈ క్రమంలోనే పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని, శక్తిని రిజెక్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపినిచ్చింది. ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని, పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని, ప్రభుత్వ విద్యను రక్షించాలని డిమాండ్ చేసింది.