చదువు కోసం చిన్నారులకు పెద్ద కష్టం
- చెంతనే బడి ఉన్నా విద్యా బోధన సున్నా
- విద్యార్థులున్నా బడికి తాళం
- చదువు కోసం మరో బడికి..
- నిత్యం నాలుగు కిలోమీటర్ల నడక
- మధ్యలో రైల్వే ట్రాక్
- మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మ తండా విద్యార్థుల గోస
మహబూబాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ప్రతి ఆవాసంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కచ్చితంగా విద్యాబోధన చేయిస్తామని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్వయంగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా అయిన రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు.. ఆచరణలో ఏమాత్రం పొంతన లేదనడానికి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె శివారు ముత్యాలమ్మ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిదర్శనంగా నిలుస్తోంది.
ముత్యాలమ్మ తండా ఆవాస ప్రాంతం విద్యార్థులకు ఒకటి నుంచి 5వ తరగతి వరకు విద్యా బోధన చేయడానికి ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి భవనాన్ని నిర్మించి, సకల వసతులు కల్పించింది. ఇక్కడ విద్యాబోధన చేయడానికి ఒక ఉపాధ్యాయున్ని కూడా నియమించింది.
రెండేళ్లుగా ఆ ఆవాస పరిధిలో ఐదో తరగతి లోపు చదువుకునే విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాలను ఉన్న ఫలంగా మూసివేయడంతో ముత్యాలమ్మ తండాకు చెందిన భూక్య బిందు (5వ తరగతి), మణికుమార్ (4వ తరగతి), అశ్విత (2వ తరగతి) ముగ్గురు విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా నిత్యం నాలుగు కిలోమీటర్ల కాలినడకన చదువు కోసం ఇంటికన్నె ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
దారి మధ్యలో రైల్వే ట్రాక్ ఉండటంతో నిత్యం ఆ చిన్నారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతూ చిన్నతనంలోనే చదువు కోసం పెద్ద కష్టం నెత్తికెత్తుకున్నారు.
విద్య హక్కు చట్టం ప్రకారం ఒక్క విద్యార్థి ఉన్న ఆ పాఠశాలలో విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. అయి తే ఇందుకు భిన్నంగా, ముఖ్యమంత్రి ఆదేశాలను సై తం పట్టించుకోకుండా ముగ్గురు విద్యార్థులు ఉన్న ముత్యాలమ్మ తండా పాఠశాలను మూసివేసి, విద్యాబోధన చేయకుండా, లక్షల రూపాయల ఖర్చుతో ని ర్మించిన పాఠశాల భవనం, వసతులు నిరుపయోగంగా మారడానికి, తమ పిల్లలు నిత్యం నాలుగు కిలోమీటర్లు చదువు కోసం ఇంటికన్నె ప్రభుత్వ పాఠశాలకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితికి అధికారులు కారణమయ్యారంటూ తల్లిదండ్రు లు ఆరోపిస్తున్నారు.
పాఠశాలకు నియమించిన ఉపాధ్యాయుడు సక్రమంగా విధులకు రాకపోవడంతో పాఠశాల మూసివేతకు కారణమయ్యిందని, ఆ ఉపాధ్యాయున్ని రెండేళ్లుగా ఇతర పాఠశాలకు డిప్యూటేషన్ ఇస్తూ, తమ పాఠశాలను విద్యార్థులు లేరనే సాకుతో మూసివేసారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.






