ఎస్‌బీఐ దూకుడు..
రూ.8 లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ
- ఈ స్థాయికి ఎదిగిన తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు
ముంబై, జూన్ 3: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. సోమవారం ఎస్‌బీఐ షేర్లు లాభాల బాటలో సాగడంతో ఈ బ్యాంకు మార్కెట్ విలువ ఒక్కసారిగా రూ.8 లక్షల కోట్లు దాటింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ కావడం విశేషం. ఎస్‌బీఐ షేర్ల విలువ దాదాపు 10 శాతం మేర పెరిగింది. గత ఆరు నెలలుగా ఎస్‌బీఐ షేర్లు 51.7 శాతం రిటర్న్‌లు సాధించి పెట్టాయి. ఇక గత 12 నెలలుగా చూసుకుంటే 53.6 శాతం మేర వృద్ధి నమోదు చేసుకున్నాయి. భారత్‌లో రూ.8 లక్షల కోట్ల మార్కు దాటిన లిస్టెడ్ కంపెనీల్లో ఎస్‌బీఐ 7వ కంపెనీ కావడం గమనార్హం. ఈ లిస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.






