రేపటి నుంచి బడులు ప్రారంభం
తొలి రోజే పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ
పునఃప్రారంభం కానున్న పాఠశాలలు
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): రేపటి (జూన్ 12) నుంచి బడి గంట మోగనుంది. దాదాపు 50 రోజులపాటు వేసవి సెలవులతో మూగబోయిన బడిగంట మళ్లీ మోగనుంది. బుధవారం నుంచి పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభం కానున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధునీకరణ పనులతో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపును సంతరిం చకుంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు 38 వేల స్కూళ్ల లో మొత్తం 60 లక్షల మంది వరకు విద్యార్థులు ఉన్నారు.
వీరిలో దాదాపు 28 లక్షల మంది వరకు విద్యార్థులు 326,823 సర్కారు పాఠశాలల్లో చదువుతున్నారు. వీరంతా జూన్ 12 నుంచి భుజాన పుస్తకాల బ్యాగులు వేసుకొని బడిబాట పట్టనున్నారు. మంగళవారంతో సెలవులు ముగుస్తుండటంతో బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే జిల్లాల నుంచి పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫామ్స్, నోట్ బుక్స్ చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అమ్మ ఆదర్శ కమిటీలకు 17,729 బడుల్లోని అత్యవసరమైన పనులన్నీ అప్పగించగా, వీటిలో 90 శాతం వరకు పనులను పూర్తి అయినట్లు అధికారులు చెబుతున్నారు. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మంచినీరు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతుల పనులన్నింటినీ అమ్మ ఆదర్శ కమిటీలే చేపడుతున్నాయి.
వినూత్నంగా అడ్మిషన్ల ప్రక్రియ
ఇదిలా ఉంటే 5,821 పాఠశాలలు సింగిల్ టీచర్‌తో నడుస్తుంటే, దాదాపు 80 శాతం బడుల్లో సబ్జెక్ లేదా భాషా పండితుల కొరత వెంటాడుతోంది. దాదాపు 10వేలకు పైగా పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ సంఖ్య 50 లోపే ఉంది. అయితే బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం వినూత్నంగా ఈసారి అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతోంది. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులనూ ఇందులో భాగస్వాములను చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ విద్యాసంవత్సరం కూడా విద్యావాలంటీర్లను తీసుకునే పరిస్థితి కనబడుటలేదు.






