24 June, 2026 | 1:45 AM

రైతువేదికలో విత్తన మేళా

24-06-2026 01:06 AM

 స్వల్పకాలిక రకాలపై అవగాహన

ఇబ్రహీంపట్నం, జూన్ 23 (విజయక్రాంతి): ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు మేలు రకపు విత్తనాలు, ఎరువులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఉప్పరిగూడ రైతువేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను పిఎసిఎస్  చైర్మన్ పాండురంగా రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తక్కువ కాలంలోనే ఎక్కువ దిగుబడినిచ్చే వరి రకాలు (RNR-15048, తెలంగాణ సోనా, KNM-1638, HNM సోనా)తో పాటు జొన్నలు, పప్పు దినుసులు, కూరగాయల విత్తనాలు సొసైటీలో అందుబాటులో ఉన్నాయన్నారు. పర్యావరణహితమైన నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను కూడా రైతులకు పరిచయం చేశారు. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మేళాకు హాజరైన పలువురు రైతులు స్వల్పకాలిక వరి రకాలైన KNM-1638, RNR-15048, పచ్చజొన్న (PSPY-2), కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియాను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఏడీఏ విద్యాదరి, ఏవో శ్రవణ్, హార్టికల్చర్ ఆఫీసర్ సృజన, నవీన్, మెట్టు అశోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితర సొసైటీ డైరెక్టర్లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.