24 June, 2026 | 1:45 AM

రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై ఆటో డ్రైవర్లకు సీఐ ఎల్లయ్య అవగాహన

24-06-2026 01:06 AM

అశ్వాపురం, జూన్ 23 (విజయక్రాంతి):  అశ్వాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో సీఐ సిలివేరు ఎల్లయ్య ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, నేరాల నియంత్రణ, ప్రయాణికుల భద్రతపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే పత్రాలు వెంట ఉంచుకోవాలని, వాటి లేకుండా వాహనాలు నడపరాదని స్పష్టం చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని లైసెన్సులు రద్దు చేసేలా చర్యలు చేపడతామని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ప్రతి డ్రైవర్ బాధ్యత అని తెలిపారు. అలాగే నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ప్రయాణికులకు కూడా భద్రతా సూచనలు తెలియజేయాలని, ప్రతి ఆటోకు తప్పనిసరిగా బీమా (ఇన్సూరెన్స్) ఉండాలని పేర్కొన్నారు. మీ భద్రతే మీ కుటుంబ భద్రత అనే సందేశంతో డ్రైవర్లను అప్రమత్తం చేశారు. ఈ అవగాహన సదస్సులో పోలీసు సిబ్బంది, మూడు ఆటో యూనియన్లకు చెందిన డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.