28 July, 2026 | 2:20 AM

రైతు ఆదరణ కరువైన విత్తన మేళా

28-07-2026 01:47 AM
  1. నంగునూరులో తూతూమంత్రంగా ప్రారంభం
  2. అసంతృప్తితో వెనుదిరిగిన ఏఎంసి ఛైర్మెన్,ప్రజాప్రతినిధులు 

నంగునూరు, జులై 27:సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన విత్తన మేళా కార్యక్రమం ప్రచార లోపంతో వెలవెలబోయింది.మూడు రోజుల పాటు జరిగే ఈ మేళా తొలిరోజు మండలంలోని 8 క్లస్టర్ల నుంచి కేవలం 10 నుంచి 15 మంది రైతులు మాత్రమే హాజరయ్యారు.ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా,మధ్యాహ్నం 12 దాటినా రైతులు రాకపోవడంతో అధికారులే ఆశ్చర్యపోయారు.

క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆరోపించారు. మరోవైపు, మేళాను ప్రారంభించేందుకు వచ్చిన నంగునూరు ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు.. రైతులు లేకపోవడాన్ని చూసి అధికారులను నిలదీశారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించకుండానే వెనుదిరిగారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి,మిగిలిన రెండు రోజులు విస్తృత ప్రచారం కల్పించి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది.అటు కొందరు ఏఈఓ లు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో తిరిగి రైతులతో మమేకం కావడం లేదని,కేవలం వాట్సాప్ విలేజ్ గ్రూపులలో మెసేజ్లు పంపడంతోనే తమ బాధ్యత ముగిసిందని భావిస్తున్నారని రైతులు వాపోతున్నారు.