30 July, 2026 | 10:36 AM

విత్తన సమస్య.. విషమ పరీక్ష

29-05-2024 01:23 AM

విత్తనమెక్కడ?

 విజయక్రాంతి నెట్‌వర్క్: మాడు పగిలే ఎండ... చెమటలు కక్కుతున్న దేహం.. పిడచ గట్టుకున్న గొంతు.. తిండీ తిప్పలన్న మాటే లేదు.. వందల మీటర్ల మేర క్యూ.. గంటల కొద్దీ నిరీక్షణ.. విత్తనాలు దొరుకుతాయో లేదోనని ఆందోళన.. షాపుల్లోకి దూసుకెళ్లేందుకు తోపులాట.. చెల్లాచెదురైన క్యూ.. రంగంలోకి పోలీసులు.. వాగ్వాదం.. గొడవ.. చివరకు ఘర్షణ. సాగుకు కావాల్సిన విత్తనాలు సాధించడం కోసం అన్నదాతలు కుస్తీ పడాల్సి వస్తున్నది. తెల్లవారుజామునే మండల కేంద్రాలు, పట్టణాలకు వచ్చి క్యూలో నిలబడుతున్నారు.

పొద్దెక్కాక ఎండకు తాళలేక పాస్ బుక్కులు, ఆధార్ కార్డు జిరాక్సులను క్యూలైన్లలో పెట్టి రైతులు నీడకు చేరుకుంటున్నారు. వ్యయప్రయాసలకోర్చి పంపిణీ కేంద్రాలు, ఫెర్టిలైజర్ షాపుల్లోకి వెళితే వారికి కావాల్సిన విత్తన బ్రాండ్స్ ‘అవుట్ ఆఫ్ స్టాక్’. ఇంకొన్నిచోట్ల వ్యాపారుల బ్లాక్ దందా. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు దొడ్డిదారిలో విత్తనాల విక్రయం. రాయితీపై ఇచ్చే జీలుగ, పిల్లిపెసర విత్తనాల పంపిణీలోనూ జాప్యం. ఇవీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఫెర్టిలైజర్ షాపుల వద్ద కనిపించిన దృశ్యాలు ! 

‘సీడ్స్’ సమకూర్చుకునేందుకు రైతుల పాట్లు

మండుటెండలో కిలోమీటర్ల మేర బారులు

తిండీ తిప్పలు మాని షాపుల వద్ద రైతుల పడిగాపులు

ఆదిలాబాద్‌లో తోపులాట

పోలీస్ బందోబస్తు మధ్య  విత్తనాల పంపిణీ

డిమాండ్‌కు తగిన విత్తనాల్లేవని రైతుల ఆందోళన

పలుచోట్ల వ్యాపారుల బ్లాక్ మార్కెట్ దందా

ఆదిలాబాద్/ ఆందోల్/ జగిత్యాల, మే 28 (విజయక్రాంతి): వానకాలం సీజన్‌కు ముందే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. సాగుకు విత్తనాలు సమకూర్చుకునేందుకు రైతన్న కుస్తీ పడుతున్నాడు. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపా రులు ‘బ్లాక్’ దందాకు పాల్పడుతున్నారు. అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల డిమాండ్‌కు తగిన విత్తనాలు అందుబాటులో ఉండడంతో లేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రైతులు అవస్థలు పడుతున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో మంగళవారం విత్తనాల పంపిణీ ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. విత్తనాల కోసం రైతులు ఉదయం నుంచే ఫెర్టిలైజర్ షాపుల ఎదుట బారులు తీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా, తిండీ తిప్పలు మాని పడిగాపులు కాశారు. ఒకదశలో విత్తనాలు దొరుకుతాయే లేదోనని షాపుల్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించి అడ్డుకోవడానికి యత్నించడంతో  స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది.

ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం అందు కున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులు, పోలీసులతో మాట్లాడారు. వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల పహారా మధ్య డీలర్లను విత్తనాలను విక్రయించారు. రాశి 659 రకం పత్తి విత్తనాలకు మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉండడంతో ఆ బ్రాండ్‌ను దక్కించుకునేందుకు రైతులు పోటీపడ్డారు. కొన్నిచోట్ల రైతులు తమ కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని మరీ వచ్చారు.

దీంతో పట్టణంలోని ఫెర్టిలైజర్ షాపులు ఉన్న మార్గాలు రద్దీగా కనిపించాయి. విత్తన విక్రయాలపై డీఏవో పుల్లయ్య మాట్లాడుతూ.. జిల్లాలో విత్తన కొరత లేదన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. సంయమనం పాటించి విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లోని ఫెర్టిలైజర్ షాపుల వద్ద పోలీసులు లాఠీచార్జ్ చేశారని కొందరు ప్రచారం చేస్తున్నారని, ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. షాపుల వద్ద పోలీసు బందోబస్తు కేవలం శాంతియుత వాతావరణం కోసమేనని స్పష్టం చేశారు.

బ్లాక్‌లో పత్తి విత్తనాలు

కరీంనగర్, మే 28 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో వ్యాపారులు పత్తి విత్తనాల కృత్రిమ కొరతను సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవైపు రైతులను నకిలీ విత్తనాల బెడద వెంటాడుతుండగా, మరోవైపు పారదర్శకంగా విత్తనాలు విక్రయించాల్సిన డీలర్లు మోసాలకు పాల్పడుతున్నారు. వానకాలం లో జిల్లావ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందుకు రైతులకు 1.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. ఒక్క ప్యాకెట్ ధర మార్కెట్‌లో సుమారు రూ. 862 కాగా, కొందరు బ్రాండింగ్ పేరుతో రైతులకు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఒక్కో ప్యాకెట్‌ను రూ.1,400 నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు.

రాశి, నూజివీడు, నార్త్ సీడ్, సాకేత్, యూఎస్ కంపెనీలకు చెందిన విత్తనాలకు మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో వ్యాపారులు ఆ బ్రాండ్ విత్తనాలు అందుబాటులో లేవని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నారు. వ్యవసాయశాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతోనే ఈ బ్లాక్ మార్కెట్ దందా నడుస్తున్నదని, వెంటనే ఆ శాఖ అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. అలాగే డీసీఎంఎస్, వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో విత్తనాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.

టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు

మంథని, మే 28 (విజయక్రాంతి):  పెద్దపల్లి జిల్లాలో నకిలీ విత్తన విక్రయాలను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం డీఏవో ఆదిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా బిజీ హెచ్, టీ పత్తి విత్తనాలు విక్రయిస్తుంటే వ్యవసాయశాఖ సహాయ సం చాలకుడు శ్రీనాథ్ (ఫోన్ నంబర్ 72888 94148), కరీంనగర్ విత్తన ధ్రువీకరణ అధికారి కిశోర్‌కుమార్ (ఫోన్ నంబర్  72888 79669)కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

అశ్వారావుపేట, మే 28: ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏవో నవీన్, ఎస్సై శ్రీరాములు శ్రీనివాసులు  హెచ్చరించారు. వ్యవసాయ, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీలర్లకు సూచనలు సలహాలు ఇచ్చారు. షాపుల్లో విధిగా స్టాక్ పట్టిక, ధరల పట్టికను ప్రదర్శించాలని సూచించారు. రైతులు కొన్న విత్తనాలు, ఎరువులకు కచ్చితంగా బిల్లులు ఇవ్వాల్సిందేనన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

విత్తనాల కొనుగోలు బిల్లులు తప్పనిసరి: ఏడీఏ

నర్సాపూర్, మే 25 : రైతులు విత్తనాలు కొనేటప్పుడు కచ్చితంగా డీలర్ల నుంచి బిల్లులు తీసుకోవాలని ఏడీఏ సంధ్యారాణి సూచించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం సీతారాంపూర్‌లో విత్తన కొనుగోలుపై మంగళవారం రైతులతో నిర్వహించిన అవగాహన కార్యక్ర మంలో ఆమె మాట్లాడారు. గుర్తింపు పొందిన ఫెర్టిలైజర్ దుకాణాల్లోనే రైతు లు విత్తనాలు కొనుగోలు చేయాలన్నా రు. రశీదులు ఖచ్చితంగా తీసుకుని, వాటిని పంట దిగుబడి వచ్చే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే తమకు సమచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

క్యూలైన్లలో పాస్‌బుక్కులు..

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మల్యాల, నూకపల్లిలో రైతులు తెల్లవారుజాము నుంచే జీలుగ విత్తనాల కోసం బారులు తీరారు. భానుడి ప్రతాపానికి తట్టుకోలేక క్యూలైన్లలో ఆధార్ కార్డులు, పాసు బుక్స్ పెట్టి నీడ ఉన్న చోటికి వెళ్లారు. మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి చెందిన రైతులు విత్తనాలు తీసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మంగళవారం పుల్కల్, చౌటకుర్ మండల కేంద్రాల్లోని అగ్రోస్ సేవా కేంద్రాలు రైతులతో కిటకిటలాడాయి. డిమాండ్‌కు తగినన్ని విత్తనాలు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోల్ ఎమ్మెల్యే, మంత్రి దామోదర రాజనర్సింహా రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విత్తనాల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.