9 June, 2026 | 2:32 AM

పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకు, కూతురుకు ఉరి

09-06-2026 01:21 AM

భార్యకు యావజ్జీవ కారాగారం

మేడ్చల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు

కుషాయిగూడ, జూన్ 8 (విజయక్రాంతి): పెన్షన్ డబ్బుల కోసం కుటుంబ పెద్దను కడతేర్చిన ఘటనలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొడుకు, కూతురుకు ఉరి శిక్ష విధించగా.. భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, కృష్ణానగర్‌కు చెందిన మారుతి సుతార్ రైల్వే శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. అనంతరం ఆయనకు వస్తున్న పెన్షన్, ఇతర ఆర్థిక ప్రయోజనాలపై కుటుంబ సభ్యుల దృష్టి పడింది.

డబ్బుల విషయంలో తరచూ విభేదాలు నెలకొనడంతో మారుతి సుతార్‌ను అడ్డుతొలగించాలని భార్య గంగాభాయి, కుమారుడు కిషన్, కూతురు ప్రపుల్ల కుట్ర పన్నారు. 2019లో నిందితులు ముందుగా మారుతి సుతార్‌కు మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చారు. స్పృహ కోల్పోయిన తర్వాత ఆయనను హత్య చేసి, నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. అనంతరం ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించినా, పోలీసుల సాంకేతిక దర్యాప్తు, పరిస్థితి జన్య సాక్ష్యాలతో నిందితుల పాత్ర బయటపడింది.

కేసు విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలు, ఫోరెన్సిక్ నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలు నిందితుల నేరాన్ని నిర్ధారించాయని ప్రధాన న్యాయమూర్తి వి బాలభాస్కర్‌రావు పేర్కొన్నారు. ఈ కేసు అత్యంత అరుదైన, అమానుష నేరాల కోవకు చెందినదిగా భావించి కిషన్, ప్రపుల్లలకు ఉరిశిక్ష విధించింది. గంగాభాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు నేరస్థులను అదుపులోకి తీసుకుని భద్రతా ఏర్పాట్ల మధ్య చర్లపల్లి జైలు, చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.