19-01-2026 01:42:25 AM
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): రెండేళ్లలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ పాల కులకు పూర్తిగా మతి భ్రమించిందని, ఆ విషయం ఖమ్మం సభ సాక్షిగా తేలిపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ విమర్శించారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే ఆగమేఘాల మీద కేసులు పెట్టి, ఆరెస్టులు చేసే పోలీసుశాఖ, డీజీపీ.. ఖమ్మం సీఎం చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని ఆదివారం ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఒక కాంగ్రెస్ సీఎంగా ఉండి, టీడీపీ పాట పాడటం వెనుక ఉన్న అసలు కుట్ర కూడా తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందని స్పష్టంచేశారు. గత రెండేళ్లుగా పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జల హక్కులను కాలరాశారని సీఎం చేసిన ప్రకటనతో నిజస్వ రూపం బట్టబయలైందని మండిపడ్డారు.
కాంగ్రెస్ మునిగిపోయే నావ అని స్పష్టమవుతుండటంతోనే దాని నుంచి ఏ క్షణానైనా బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా రుజువవుతున్నదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక ఒక వైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలు తరిమికొట్టిన టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే, నీళ్ల నుంచి మొదలుకుని నిధులు, నియామకాల వరకూ సీఎం పన్నాగాలను నాలుగు కోట్ల సమాజం తప్పకుండా తిప్పికొడుతుందని హెచ్చరించారు.