అంచనాల్ని మించిన ఎస్బీఐ

10-05-2024 01:48:51 AM

24 శాతం వృద్ధితో రూ.20,698 కోట్లకు నికరలాభం

రూ.లక్ష కోట్లు దాటినస్థూల వడ్డీ ఆదాయం

షేరుకు రూ.13.70 డివిడెండు

న్యూఢిల్లీ, మే 9: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2024 మార్చితో ముగిసిన క్యూ4లో విశ్లేషకుల అంచనాల్ని మించిన ఆర్థిక ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాంకు నికరలాభం 24 శాతం వృద్ధిచెంది రూ.20,698 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 16,694 కోట్ల లాభాన్ని ఆర్జించింది. పలు బ్రోకరేజ్ సంస్థలు, విశ్లేషకులు ఎస్‌బీఐ లాభం క్యూ4లో రూ.13,500 కోట్ల మధ్య ఉంటుందని ప్రకటించిన అంచనాల్ని పెద్ద మార్జిన్‌తో బ్యాంకు అధిగమించింది. గురువారం సమావేశమైన బ్యాంకు డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.13.70 చొప్పున డివిడెండును సిఫార్సుచేసింది. డివిడెండు చెల్లింపునకు మే 22 రికార్డుతేదీగా నిర్ణయించింది.

డివిడెండు చెల్లింపు తేదీ జూన్ 5. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎస్బీఐ ఆర్జించిన వడ్డీ ఆదాయం రూ.లక్ష కోట్లు దాటింది. ఇది నిరుడు ఇదే త్రైమాసికంకంటే 19 శాతం వృద్ధిచెంది రూ.92,951 కోట్ల నుంచి రూ. 1,11,043 కోట్లకు పెరిగింది. అలాగే బ్యాంకు వడ్డీ చెల్లింపులు 32 శాతం పెరిగి రూ.52,559 కోట్ల నుంచి రూ. 69,387 కోట్లకు చేరాయి. సంపాదించిన వడ్డీ, చెల్లించిన వడ్డీ మధ్య వ్యత్యాసమైన నికర వడ్డీ ఆదాయం 3 శాతం పెరిగి రూ.40,393 కోట్ల నుంచి రూ. 41,655 కోట్లకు చేరింది. బ్యాంకు నిర్వహణా లాభం 17 శాతం ఎగిసి రూ. 28,748 కోట్లకు చేరింది.

రూ.49 లక్షల కోట్లకు డిపాజిట్లు

ముగిసిన మార్చి31నాటికి ఎస్బీఐ డిపాజిట్లు గత ఏడాదితో పోలిస్తే 11 శాతం పెరిగి రూ.49,16,077 కోట్లకు చేరాయి. ఇందులో కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాలు) డిపాజిట్లు రూ.19,41,996 కోట్లుకాగా, దేశీయ టెర్మ్ డిపాజిట్లు రూ.27,82,340 కోట్లు. మరోవైపు బ్యాకు స్థూల అడ్వాన్సులు 15 శాతం పెరిగి రూ.37,67,535 కోట్లకు చేరాయి. ఇందులో వ్యక్తిగత రుణాలు 15 శాతం వృద్ధితో రూ.13,52,265 కోట్ల వద్ద నిలిచాయి. వ్యక్తిగత రుణాల్లో రూ. 7,25,818 కోట్ల గృహ రుణాలు ఉన్నాయి.

పదేండ్ల కనిష్ఠానికి స్థూల ఎన్‌పీఏలు

మార్చి త్రైమాసికంలో ఎస్బీఐ ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. స్థూల ఎన్‌పీఏలు (జీఎన్‌పీఏ) 2.78 శాతం నుంచి రూ.2.24 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 0.67 శాతం నుంచి 0.57 శాతానికి దిగివచ్చాయి. ఫలితాల వెల్లడి తర్వాత ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా మీడియాతో మాట్లాడుతూ తమ జీఎన్‌పీఏ పదేండ్ల కనిష్ఠానికి తగ్గినట్టు వెల్లడించారు. క్యూ4లో తమ రుణాల వృద్ధి పటిష్ఠంగా ఉన్నదని, గత ఎనిమిది త్రైమాసికాల్లో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని సాధించామని చైర్మన్ తెలిపారు. కార్పొరేట్ రుణాలు 16 శాతం పెరిగాయన్నారు. రానున్న త్రైమాసికాల్లో ఇదేతరహా రుణ వృద్ధిని కనపరుస్తామని ఖారా వివరించారు. ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో 15 శాతం రుణవృద్ధిని, 13 శాతం డిపాజిట్ల వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.