నేతన్నల వెతలు

27-04-2024 01:55:25 AM

సిరిసిల్లలో కార్మికుల వరుస ఆత్మహత్యలు

నలభై రోజుల్లో ఐదుగురి మృతి

ఒక్కరోజే ముగ్గురు బలవన్మరణం

ప్రభుత్వమే ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలి..

నేతన్నల కుటుంబాల విజ్ఞప్తి 

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 26 (విజయక్రాం తి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఆర్డర్ల కొరతతో పనులు నిలిచిపోయాయి. పని చేస్తేనే పూట గడిచే కార్మికుడు.. ఓవైపు ఉపాధి లేక మరోవైపు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసు కుంటున్నారు. జిల్లాలో వరుసగా బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. సిరిసిల్లలో 34 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. పాతికవేల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. కార్మికులకు పనులు సాగితే నెలకు రూ.20 వేల వరకు వారి నైపుణ్యాన్ని బట్టి సంపాదన ఉంటుంది. ప్రస్తుతం పనులు లేకపోవడం తో వస్త్రపరిశ్రమపై ఆధారపడ్డ ఆటో డైవర్లు, లోడింగ్, వెల్డర్లు, కార్పెంటర్ల వంటి అనుబంధ కార్మికులకూ ఉపాధి కొరవడింది. సిరిసిల్లలో నెలకొన్న వస్త్ర సంక్షోభంతో ఒకేరోజు ఇద్దరు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం, మరో కార్మికుడు ఆకలిచావు కు గురవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. గత నెలలో ఇద్దరు కార్మికులు ఉరివేసుకుని చనిపోయారు. 

40 రోజుల్లో ఐదుగురి ఆత్మహత్య..

తంగళ్లపల్లిలోని ఇందిరానగర్‌కు చెందిన నేత  కార్మికుడు అంకారపు మల్లేశం (60), భార్య భారతి బీడిలు చుడుతూ కుటుంబా న్ని పోషిస్తున్నారు. కొడుకు మహేందర్, కూతురు మనీష ఉన్నారు. కూతురుకు పెళ్లి చేశారు. భారతికి కాలు విరడగంతో చికిత్స కోసం డబ్బులు ఖర్చయ్యాయి. అదే సమయంలో పనులు నిలిచిపోవడంతో కుటుంబాన్ని పోషించలేక, అప్పులు పెరగటంతో మల్లేశం ఉరి వేసుకుని చనిపోయారు. 

సిరిసిల్ల పద్మనగర్‌లో ఆడిశర్ల సాయి (25) వార్పిన్ పరిశ్రమలో భీములు పోసే కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శిథిలమైన తన ఇంటిని వదిలి అద్దెకు ఉంటు న్నారు. పదేళ్లుగా తండ్రి కైలాసం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. అన్న మహేందర్ మెడికల్ ఏజెన్సీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఇంటి అవసరాలు, వైద్యం కోసం రూ.10లక్షల అప్పు అయ్యింది. గత నాలుగు నెలలుగా చేతిలో పని లేకపోవడంతో ఇంటి అద్దె చెల్లించేందుకు, కుటుంబ పోషణకు డబ్బులు లేకపోవడంతో మానసికంగా కుంగిపోయి తన ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు.

సిరిసిల్ల నెహ్రూనగర్‌కు చెందిన ఈగ రాజు(50) తన ఇంట్లోనే ఆరు మరమగ్గాలను నడిపించేవాడు. వాటి నిర్వహణకు డబ్బులు లేకపోవడంతో ఏడాది క్రితం అమ్మేసి కార్మికుడిగా పనులు చేస్తున్నా డు. ఆయనకు భార్య రేఖ, కొడుకు దేవీప్రసాద్, కూతురు లక్ష్మీప్రసన్న ఉన్నారు. సిరిసిల్ల పరిశ్రమలో కొద్దిరోజులుగా పను లు లేకపోవడంతో 16 రోజుల క్రితం ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లాడు. ఆయన కోసం కుటుంబసభ్యులు వెతికి నా ప్రయోజనం లేకుండాపోయింది.

బుధవారం రామడుగు మండలం వెదిర గ్రామ శివారులో శవమై దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. పనికోసం వెళ్లి చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో చనిపోయినట్లు భార్య రేఖ తెలిపింది. గతంలోనూ ఇలాగే వెళ్లాడని, తిరిగివస్తాడని అనుకున్నామని కుటుంబసభ్యులు తెలిపారు. విగతజీవిగా వస్తాడని ఊహించలేదని చెబుతూ రేఖ విలపించింది. తమకు అప్పులు ఉన్నాయని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. గత నెలరోజుల్లో బీవై నగర్‌కు చెందిన తడుక శ్రీనివాస్, రాజీవ్‌నగర్‌కు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ ఉపాధి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న కార్మికులు పనులు లేకపోవడం, పరిశ్రమలు నిలిపివేయడంతో ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి, పాత బకాయిలు, విద్యుత్ సబ్సిడీ పూర్తిగా చెల్లించి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కార్మికులు, అసాము లు కోరుతున్నారు. పరిశ్రమను ఆదుకోవాలంటే ప్రభుత్వ విభాగాలకు, కార్పొరేషన్లు, యూనిఫాం, వివిధ పండుగలకు ప్రభుత్వం ఇచ్చే వస్త్రాలను చేనేత పరిశ్రమకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

రూ.25లక్షలు చెల్లించాలి

ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల కు ప్రభుత్వం వెంట నే రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. వస్త్ర పరిశ్రమ కు రావాల్సిన బకాయిలు, యార్న్ సబ్సిడి అందించాలి. తమిళనాడు తరహాలో ప్రభుత్వం చేనేతకు పనులు ఇవ్వాలి. 

 రమేశ్, సీఐటీయూ నాయకుడు


ప్రభుత్వం ఆదుకోవాలి

మాది పేద కుటుంబం. పను లు చేసుకుంటేనే కుటుంబం గడుస్తుంది. పనిలేక చేతికందిన కొడుకు ఉరివేసుకున్నాడు. పదేళ్లుగా నేను పక్షవాతంతో బాధపడుతున్నాను. అప్పు లు ఉన్నాయి. ఇల్లు కూలిపోతుందని కిరాయికి ఉంటున్నాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. 

 కైలాసం, మృతుడు సాయి తండ్రి