సాంకేతికతతోనే పారదర్శక సేవలు
ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం దేవరకద్రలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శారీరక వైకల్యం కలిగిన వారు ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో, ప్రభుత్వం మంజూరు చేసిన త్రీ వీలర్ స్కూటర్లు, ట్రై సైకిళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే తమకు అసలైన సంతృప్తి" అని అన్నారు.
అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా దేవరకద్ర, సీసీకుంట, కౌకుంట్ల మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే ఆధునిక 5G స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చని, సాంకేతికత వల్ల పౌష్టికాహార పంపిణీలో అవినీతికి తావుండదని, క్షేత్రస్థాయి డేటా వేగంగా ప్రభుత్వానికి చేరుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేసి, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.






