అస్ట్రేలియాలో షాద్‌నగర్ యువకుడు మృతి
సిడ్నీలో సముద్రం ఒడ్డున మృతదేహం లభ్యం
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
రంగారెడ్డి, మే 24 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన అరటి అరవింద్‌యాదవ్(30) ఆస్ట్రేలియా లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి కారు వాష్ చేయించేందుకు వెళ్లిన అరవింద్ తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, మిత్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఒక బీచ్‌లో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహం అరవింద్‌దిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
షాద్‌నగర్ పట్టణానికి చెందిన దివంగత బీజీపీ సీనియర్ నేత అరటి కృష్ణయాదవ్ కుమారుడే అరవింద్. 12 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం అరవింద్ అస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో స్థిరపడ్డాడు. రెండేళ్ల క్రితమే అరవింద్ పెళ్లి కాగా ప్రస్తుతం భార్య గర్భవతి. వచ్చే సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి అరవింద్ షాద్‌నగర్‌కు వచ్చేందుకు విమాన టికెట్లు సైతం బుక్ చేసుకొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతలోనే ఘోరంగా జరిగిపోయిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అరవింద్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరవింద్ ప్రయాణించిన కారు సముద్రానికి కొద్ది దూరంలో పార్క్‌చేసి ఉంది.
అరవింద్ ప్రమాద వశాత్తు మరణించాడా? ఎవరైనా హత్యచేశారా? లేక ఆత్మహత్యనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరవింద్ మృతి వార్తతో షాద్‌నగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆస్ట్రేలియా నుంచి అరవింద్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చొరవ తీసుకోవాలని మృతుడి బంధువులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. దీంతో ఆయన విదేశాంగమంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. అరవింద్ మృతిపై దర్యాప్తు చేయించడంతోపాటు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అన్ని చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.






