15 August, 2026 | 6:18 PM

జనగామలో కుల బహిష్కరణ?

25-05-2024 12:20 AM

జనగామ, మే 24(విజయక్రాంతి): జనగామ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి ఇటీవల మృతిచెందగా, ఆయన కుటుంబాన్ని కుల పెద్దలు బహిష్కరించడం కలకలం రేపింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు జనగామ పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన ఉల్లెంగుల లలిత శుక్రవారం మీడియా ఎదుట తన గోడు వెల్లబోసుకున్నారు. లలిత భర్త ప్రభాకర్ ఆర్థిక సమస్యలతో ఈ నెల 18న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంత్యక్రియల అనంతరం మూడు రోజుల కార్యక్రమంలో కొందరు కావాలని గొడవ చేశారని, తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపించింది.

ఆ గొడవను మనసులో పెట్టుకుని తమను కులబహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తంచేసింది. కుల సభ్యులకు ఫోన్లు చేసి తమ కుటుంబంతో ఎవరూ మాట్లాడొద్దని, తమ ఇంటికి వెళ్లొద్దని, ఎవరైనా తమతో మాట్లాడితే వారికి కుల బహిష్కరణ తప్పదని కుల పెద్దలు ఆదేశించినట్టు చెప్పింది. కుల పరపతి సంఘంలో జరిగిన లావాదేవీల సమస్య వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, ఇప్పుడు కుల బహిష్కరణ అంటూ తనను కూడా మానసిక వేదనకు గురిచేస్తున్నారని బాధితురాలు వాపోయింది. అనంతరం ఆమె జనగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, తాము ఎలాంటి కుల బహిష్కరణ చేయలేదని, అంత్యక్రియల వద్ద కొందరిని మృతుడి భార్య దూషించడం వల్లే స్వచ్ఛందంగా కొందరు వారి ఇంటికి వెళ్లడం లేదని కుటు పెద్దలు చెప్పడం గమనార్హం.