విద్యార్థుల ప్రగతే ధ్యేయంగా.. అనంత కుమార్ సేవలకు అభినందన
నాగలిగిద్ద,(విజయక్రాంతి): నాగల్ గిద్ద మండలంలోని షాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం అనంత కుమార్ ఉద్యోగ విరమణ సందర్భంగా నాగలిగిద్ద మండల వనరుల కేంద్రంలో ఘనంగా సన్మానించారు. మండల విద్యాధికారి మన్మధ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అనంత కుమార్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ మన్మధ కిషోర్ మాట్లాడుతూ అనంత కుమార్ తన సుదీర్ఘ సేవా కాలంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.
ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే గొప్ప బాధ్యత అని అన్నారు. అనంత కుమార్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా విధులు నిర్వహించారని, తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన అనుభవం, సేవలు విద్యారంగానికి విలువైనవని అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజానికి, విద్యార్థులకు తన అనుభవంతో మార్గనిర్దేశం చేయాలని ఆకాంక్షించారు.
ఆయనకు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని కోరారు. అనంత కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు తనవంతు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తన సేవా కాలంలో సహకరించిన అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, బసవరాజ్, సూర్యకాంత్, హరికృష్ణ, రాము, అప్పారావు, సత్తయ్య, తులసిరావు, మండల స్ట్రాంగ్ టీచర్ రాఘవేంద్ర గౌడ్, సీఆర్‌పీ అర్జున్ ప్రభు సింగ్ తదితరులు పాల్గొన్నారు.






