ప్రజ్వల్ జర్మనీ వెళ్లడంలో బీజేపీ సహకారం

06-05-2024 12:32:13 AM

ప్రజ్వల్ రేవణ్ణని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ డిమాండ్

బెంగళూరు, మే 5 (విజయ క్రాంతి) :  మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజ్వల్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘా లు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీ నాయకుల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ ప్రజ్వల్ సెక్స్ కుంభకోణంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే పజ్వల్ రేవణ్ణ లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును ఉపసంహరించాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినందుకు ఆయనను అభినందించారు. ప్రజ్వల్ సెక్స్ కుంభకోణంలో బయటకు వస్తున్న ప్రతి వార్త భయంకరంగా ఉందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా సరైన పద్ధతిలోనే కేసు విచారణ జరుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొ న్నారు. ఈ కేసులో జేడీఎస్ మిత్రపక్షం బీజేపీ ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. ప్రజ్వల్‌ను కాపాడేందుకే బీజేపీ పెద్దలు ఆయనను జర్మనీ పంపినట్లు తెలుస్తోందన్నారు. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలోనే స్పందిస్తుందని, బాధితులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. కాగా, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణ పలువురు మహిళలను లైంగికంగా వేధించడమే కాకుండా అశ్లీల వీడియోలు తీసి చిత్ర హింసలకు గురిచేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో హెచ్‌డీ రేవణ్ణను శనివారం కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు.