పౌరుల రక్షణే.. ప్రాథమిక లక్ష్యం

06-05-2024 12:38:08 AM

నిజ్జర్ హత్య కేసుపై కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యలు

కెనడా, మే 5 (విజయక్రాంతి) : ఖలిస్తానీ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు సంచల నంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానిత భారతీయులను శనివారం కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామంపై కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో స్పందిస్తూ.. “కెనడా రూల్ ఆఫ్ లా, స్వతంత్ర న్యాయ వ్యవస్థ గల దేశం. మేము హింసను సహించబోం. మా దేశంలో నివసించే పౌరులం దరి రక్షణే తొలి ప్రాధాన్యత” అని స్పష్టం చేశారు. కెనడాలో నివసిస్తున్న సిక్కు ప్రజలకు భరోసా కల్పించారు. శనివారం సెంటె నియల్ గాలాలో నిర్వహించిన సిఖ్ హెరిటేజ్ డేలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశా రు. నిజ్జర్ హత్యలో అరెస్టయిన ముగ్గురు వ్యక్తుల ప్రమేయంపై ప్రత్యేక, విభిన్న దర్యాప్తు కొనసాగుతుందని ప్రధాని వెల్లడించారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడాలోని సిక్కు సమాజం తమకు రక్షణ కొరవడినట్లు భావిస్తున్నారని ట్రూడో అన్నా రు.ప్రతి కెనడియన్‌కు ఈ దేశంలో వివక్ష, హింస, బెదిరింపుల నుంచి సురక్షితంగా ఉండే హక్కు ఉందన్నారు.

మరోవైపు నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేయడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు. ఖలిస్తాన్ అనుకూల వర్గంలోని ఒక సమూహం కెనడా ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుంటున్నారని, సిక్కులను ఓటు బ్యాంకుగా మార్చారని ఆయన ఆరోపించారు. కెనడా పాలకపక్షానికి పార్లమెంట్‌లో మెజార్టీ లేనందున కొన్ని పార్టీలు ఖలిస్తాన్ అనుకూల నాయకులపై ఆధారపడుతున్నాయన్నారు. వీసా, చట్టబద్ధత, పొలిటికల్ స్పేస్‌ను ఖలిస్తాన్ మద్ధతుదారులకు ఇవ్వొద్దని భారత్ ఇప్పటికే కెనడాకు సూచించింద ని, ఏదైనా జరిగితే అది ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని జైశంకర్ హెచ్చరించారు. కెనడా భారత్‌ను నిందించడం వారి రాజకీయ దుర్బలత్వానికి నిదర్శ నమన్నారు. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్నందున, వారు ఓటు బ్యాంకు రాజకీయాల్లో మునిగిపోయినట్లు జైశంకర్ చురకలంటించారు. కాగా, నిజ్జర్ హత్య కేసులో అరెస్టయిన ముగ్గురు భారతీయుల ఫోటోలను కెనడియన్ పోలీసులు విడుదల చేశారు. కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ బ్రార్ (22), కరణ్ ప్రీత్ సింగ్ (28) అనే ముగ్గురు నిందితులను అల్జెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్ సిటీలో అరెస్ట్ చేశారు.