calender_icon.png 20 December, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిఖరంపై ఆమె

15-12-2025 12:48:22 AM

శీలాన్ని దునుమాడే అసభ్య పద బంధం

బతుకు పోరులో ధీరురాలైన

ఆమెను ఇసుమంతైనా కుంగదీయదు

ముఖ కవలికల్ని చూడని 

ఏ చరవాణిలోనో..

మాట పరం పరలు పొడిపొడిగా

వెగటుగా రాలిపోవచ్చు

కానీ..

నిన్ను నిలువునా చీల్చి

నీ అణువణువులో నిండిన

అహంకార అశ్లీల ధ్వని తరంగాల్ని

సరిచేసే శస్త్రచికిత్స

వెనువెంటనే మొదలవుతోంది


హాలో.. ట్రోలర్

నీ వికృత అవివేక వాక్కులు

శీలం పై శీఘ్ర స్ఖలన ద్రుక్కులు

ఆమె మనో నిబ్బరాన్ని

ఏ మాత్రం సడలించవు..

నిన్ను ఖండఖండాలుగా ఖండించటానికి

ఏ ఆయుధాలు ఆమెకు 

అవసరం లేదు


నీ నిర్లజ్జాదూషిత మనో వైకల్యాన్ని

సరితూచటానికి.. సరి చేయటానికి

నీ కంఠానికి ఉరి బిగించటానికి

ఆమె కసితో అల్లిన

అక్షర శరాలు చాలు కదా...


నీకు తలొగ్గని వనితలంతా..

నువ్వూహించి నట్లే బిచ్‌లై వుండరు

ఎక్కడ భంగపాటుతో 

దేహం నేలను తాకుతుందో అక్కడే

మళ్లీ మళ్లీ నిటారుగా నిలబడి

సవాలు విసురుతోంది చూడు..

గతం కాదు వర్తమానంలోకి రా..

ఆదిమానవుడిలా చేయకు

ఆధునికంగా అడుగులు వేయ్

నీ అపవిత్ర వాజ కూతతో

కదలాడిన చూపులు మాటలూ..

ఏవీ ఆమెను బజారుకీడ్చవు

నిన్నూ నీ కురూపితనాన్ని

ఆమె అక్షర గొలుసులు

ఆకాశాన వేళ్లాడదీస్తాయి చూడు

బతుకు బండి సాగే రహదారిపై

ప్రేమలూ ద్వేషాలూ త్యాగాలూ బాధలూ

అన్నీ దేహాన్ని చుట్టుకునే వుంటాయి

ఇప్పుడు అలా దూషించిన 

నువ్వే దిగంబరమయ్యావు

కాలగమనంలో కుబుసాలు విడిచి

కొత్త మాటల తోటలవైపు 

నువ్వు నడవొచ్చు

ఎదురుగా వున్న శిఖరంపై ఆమె

నీకు ఓ దేవతలా కనిపించనూ వచ్చు

అప్పుడైనా ఆమె పాదాల వద్ద మోకరిల్లి

క్షమాపణలు అర్థించు !

 డా.కటుకోఝ్వల రమేష్