calender_icon.png 14 December, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనిపించని ప్రజాపాలన మార్క్!

14-12-2025 12:00:00 AM

డాక్టర్ తిరునహరి శేషు  :

తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన ఒక దశాబ్దపు నిరీక్షణ తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా రేవంత్ రెడ్డి నేతృ త్వంలోని కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. బీఆర్‌ఎస్ దశాబ్ద పాలనపై ప్రజా వ్యతిరేకత, ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో పాటు ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రేవంత్ నాయకత్వం హస్తం పార్టీని విజయ తీరాలకు చేర్చింది. అప్పటి వరకు కనీసం మంత్రిగా కూడా పనిచేయని రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అనుమానాలతో ప్రారంభమైన ప్రజాపాలన రెండు వసంతాలు పూర్తిచేసుకుని సగర్వంగా మూడో వసంతంలోకి అడుగుపెట్టింది. 

అయితే రెండేళ్ల ప్రజాపాలనపైై, సీఎంగా రేవంత్ పనితీరుపై రాష్ర్ట వ్యా ప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. పాలనా అడ్డంకులను అధిగమిస్తూ, ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కొంటూ, అభివృద్ధికి కొత్త విధానాలను రూపొందిస్తూ, సంక్షేమ హామీలను నెరవేర్చే క్రమంలో రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్న చం దంగా రెండేళ్ల పాలనా ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్న భావ న కలుగుతున్నది.

అరకొర సంక్షేమం!

సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీని ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా భావిస్తారు. 2004 లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 లాంటి పథకాలతో సంక్షేమ అజెండాపై ఒక చెరగని ము ద్ర వేశారు. తెలంగాణ రాష్ర్టంలో కూడా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 420 హామీలు అధికారాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాయి.

అధి కారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గ్యారెంటీ కార్డులను పంచిన కాంగ్రెస్ ఆ గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో విఫల మైంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వశనీయతను ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్ని స్తున్నారు. ఆరు గ్యారంటీల్లో ఉన్న 13 హామీల్లో ఎనిమిదింటిని మాత్రమే ప్రారంభించినప్పటికీ, అవి కూడా తమ లక్ష్యా లను చేరుకోలేకపోయాయి. ఇందిరమ్మ ఇల్లు గ్యారెంటీ కింద రెండేళ్లలో ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.

కానీ రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలు అమలు చేసినప్పటికీ.. ప్రతి మ హిళకు నెలకు 2,500 రూపాయలు ఇచ్చే హామీ ఇప్పటికీ నెరవేరలేదు.

చేయూత గ్యారెంటీలో ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచినప్పటికీ, లక్షలాదిమంది వృ ద్ధులకు ఆసరగా నిలిచే పెన్షన్‌ను 4వేల రూపాయలకు పెంచకపోవడంతో గ్యారంటీల అమల్లో ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతుందనే అభిప్రాయం కలుగుతుంది. ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్‌లో ప్రభుత్వం 56 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. కానీ వాటిని కూడా పూర్తిగా ఖర్చు చేయడంలో విఫలమయ్యింది.

అభివృద్ధిపై ప్రభావం..

సామాజిక వర్గం కూడా ప్రజాపాలనపై అసంతృప్తితోనే ఉన్నది. 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం, సన్నాలకు బోనస్ ఇచ్చినప్పటికీ.. రైతు భరోసా కింద 15 వేల హా మీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. యూరియా కష్టాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వకపోవడం, దళిత బంధు పూర్తిగా పక్కన బెట్టడం లాంటివి పాలనపై అసంతృప్తి వ్యక్తమయ్యేలా చేస్తుంది.

బడ్జెట్ లో వివిధ సామాజిక వర్గాల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయలను కేటాయించి ఆ నిధులను కూడా ఖర్చు చేయడం లేదన్న విమ ర్శలు పెరిగిపోయాయి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మూడు కోట్ల మంది పేదలకు సన్న బియ్యం పంపిణీ లాంటి పథ కాలు పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. రెండేళ్ల పాలనలో ప్రజల మనసుపై ముద్ర వేసిన పథకాలు, ప్రజల జీవితాలను మార్చిన సంక్షేమ పథకాలు మాత్రం పెద్దగా కనిపించలేదు.

అభివృద్ధి, సంక్షేమం మాకు రెండు కళ్ళు అని ప్రభుత్వాలు తరచూ చెబుతుంటాయి. కానీ ఈ దశాబ్ద కాలంలో తెలంగాణను ఉన్నత స్థాయిలో నిలబెట్టే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభ దశలోనే ఉండటం బాధాకరం. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గత ప్రభుత్వం కాలేశ్వరం లాంటి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినా దాని చుట్టూ వివాదాలు, విద్యుత్ ప్రాజెక్టులు పూర్తికాకపోవటం, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను సాధించలేకపోవటంతో అభివృద్ధి ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.

ఇక రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టును  పూర్తి చేయడంలో ఆలసత్వం కనిపిస్తున్నది. రాష్ర్ట ఆదాయం పెరగకపోవడం, అప్పులు పెరిగిపోతుండడం, అవినీతి కూడా హెచ్చుమీరడం వల్ల రాష్ర్ట అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. 

కొంతమేర సఫలం..

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చిన తర్వాత సీఎం రేవంత్ రెండుసార్లు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడం, అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో పర్యటించి మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్--2047 సదస్సులో 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రభు త్వం సఫలం కావడంతో కొంతమేర లక్ష్యం దిశగా పయనించిందని చెప్పొచ్చు.

అంతేకాదు మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళనతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలనే ప్రయత్నం, రాష్ర్ట సమగ్రాభివృద్ధికి రై జింగ్ విజన్ డాక్యుమెంట్ -2047.. భవిష్యత్తు భరోసా అనే భావన కలిగించడంలో రేవంత్ సర్కార్ విజయం సాధించింది. అయితే మానవాభివృద్ధిలో కీలక రంగాలైన విద్య, వైద్యారోగ్య రంగాల్లో ప్రభుత్వం ఈ రెండేళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో విఫలమైంది.

ప్రభుత్వ బడు లు, ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచకుండా.. 100 నియోజకవర్గాల్లో 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయల వ్య యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం ఎందుకనేదానిపై ప్రభు త్వం సమాధానమివ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు అసంతృప్తిగానే ఉన్నారు. 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం..

మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం బాగానే ఉంది. మరి గత ప్రభుత్వం ప్రకటించిన 80 వేల ఉద్యోగాలు ఎక్కడికి పోయినట్టు? మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైనట్టు? జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయినట్టు? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

అంచనాలకు దూరంగా..

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పార్టీలో అసంతృప్తులను, ప్రతిపక్షాలను కట్టడి చేయటంలో సీఎం రేవంత్ విజయం సాధించారని చెప్పొచ్చు. లోక్ సభ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిశ్రమ ఫలి తాలు సాధించినప్పటికీ.. ఉప ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి ప్రతిపక్షాలపై పైచేయి సాధించారు. గ్రామపంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వ డాన్ని భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతంగా చూడాలి.

ఉద్యమ లక్ష్యాలు, నిధులు, నీళ్లు, నియామకాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ అంచనాలను చేరుకోలేకపోయిందని చెప్పవచ్చు. గత ప్రగతిభవన్ పాల నతో పోల్చి చూస్తే ప్రజాపాలన కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదనిపిస్తోంది. పాలకులు మారారే తప్ప ప్రజల బతుకులు పెద్దగా మారలేదన్న అభిప్రాయాలు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.

 వ్యాసకర్త సెల్: 9885465877