9 May, 2026 | 9:48 AM

ఆమె కాంగ్రెస్ తల్లే

11-12-2024 12:28 AM
  1. * తెలంగాణ తల్లికి బతుకమ్మను దూరం చేశారు 

* మహిళలకు విగ్రహాలు, పురుషులకు వరాలా!

* రాష్ట్ర ఆడబిడ్డలు ఎదగొద్దా? నగలు ఉండొద్దా?

* తెలంగాణ అస్థిత్వాన్ని జీవోతో మార్చలేరు 

* ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి):  అమ్మను చూస్తే స్ఫూర్తి పొందేలా ఉండాలని, మన సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మను చేతిలో పట్టుకుని ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టి రాష్ట్ర ప్రజల మనసులు గాయపరిచారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రాష్ట్ర వారసత్వాన్ని రూపుమాపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. అస్థిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను జీవోతో మార్చలేరని తేల్చిచెప్పారు.

‘తెలంగాణ తల్లి చేతిలో ఉన్న జొన్నలు, మక్కలు తెలంగాణకు ప్రతిక అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. అవి ఇతర రాష్ట్రాల్లో పండవా’ అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత మంగళవారం పాలు, పంచామృతంతో అభిషేకం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో మనకు మాత్రమే ప్రత్యేక పండుగైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ స్థానంలో హస్తం గుర్తును పెట్టి ఇదే తెలంగాణ తల్లి అనడం దారుణమన్నారు.

‘తొమ్మిది మంది కవులు, కళాకారులను సన్మానించి ఇంటి స్థలం, రూ.కోటి ఇస్తామని సీఎం ప్రకటించడం సంతోషమే.. అందులో మహిళలకు స్థానం ఎందుకు ఇవ్వలేదు’ అని  ప్రశ్నించారు. ‘విమలక్క, పీవోడబ్ల్యూ సంధ్య, మా భూమి సంధ్య, బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సదాలక్ష్మి వంటి త్యాగధనులు గుర్తు రాలేదా? అంటూ మండిపడ్డారు. ‘మహిళలకు విగ్రహాలు , పురుషులకు వరాలా?’ ఇది చాలా అన్యాయమన్నారు.  తెలంగాణ తల్లిది బీద తల్లి రూపమని అంటున్నారు..  అంటే తెలంగాణలో కూలి చేసుకునే పేదలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశ్యం అన్నట్టుగా ఉందన్నారు.

వాళ్లు ఎదగొద్దా? నగలు పెట్టుకోవద్దా? అంటూ ప్రశ్నించారు. ప్రసంగంలో ఒక్క సామాన్య మహిళ పేరు కూడా తీయని సీఎంను తాము ఎలా నమ్మాలన్నారు. తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న ఎవ్వరూ బాగుపడలేదని హెచ్చరించారు. ఆ విషయం ఆయన గురువు చంద్రబాబునాయుడుకు బాగా తెలుసునని, ఆయన నుంచి నేర్చుకోవాలని సీఎం రేవంత్‌కు సూచించారు.