9 May, 2026 | 8:54 AM

న్యాయ పోరాటంలో నేనే గెలిచా

11-12-2024 12:25 AM
  1. చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు 
  2. భారత పౌరుడు కాదని తెలిసినా టికెట్ ఇచ్చారు
  3. మాజీ ఎమ్మెల్యే రమేశ్‌తోపాటు కేసీఆర్‌కూ శిక్ష పడాలి 
  4. విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): బలహీన వర్గాలకు చెందిన తనను అణచివేసేందుకు ఎంతో ప్రయత్నించారని.. 15 ఏళ్ల న్యాయపోరాటంలో తానే గెలిచానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టులాంటిదని ఆయన అన్నారు. చెన్నమనేని భారత పౌరుడు కాదని తెలిసినా కేసీఆర్ ఆయనకు కావాలనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జర్మనీ పాస్‌పోర్టుతో తిరుగుతున్న రమేశ్‌కు కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఇచ్చాడని విమర్శించారు.

చెన్నమనేనితో పాటు కేసీఆర్‌కు కూడా శిక్ష పడాలని, వేములవాడ ప్రజలకు కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చెన్ననమేని నిజాలు దాచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడని కోర్టు స్పష్టం చేసినట్టు తెలిపారు. ప్రతి రోజు ఏదో ఒక అంశంపై స్పందించే కేటీఆర్.. దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

తండ్రి చాటు బిడ్డగా చెన్నమనేని వేములవాడకు వచ్చి.. కేంద్ర అధికారులను మేనేజ్ చేసి కోర్టు తీర్పు ఆలస్యమయ్యేలా చేశాడని ఆరోపించారు.  దేశ పౌరుడు కాని వ్యక్తిని చట్టసభకు పంపిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. కోర్టు తీర్పు తర్వాత కూడా రమేశ్ అబద్ధాలు మాట్లాడుతున్నారని విప్ మండిపడ్డారు.

చెన్నమనేని ఇండియాకు వస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే చెన్నమనేని ఓటుహక్కును హైకోర్టు రద్దు చేసిందని, కేంద్ర ప్రభుత్వం కూడా భారత పౌరసత్వాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. చెన్నమనేనిని చట్ట ప్రకారం శిక్షించాలని శ్రీనివాస్ కోరారు.

భారత పౌరసత్వం విషయంలో చెన్నమనేని పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లితే.. అక్కడ కూడా న్యాయపోరాటం చేస్తానని శ్రీనివాస్ హెచ్చరించారు. ధర్మపురి నియోజకవర్గంలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కూడా ఓట్ల లెక్కింపులో మోసం చేసి ఓడించారని ఆయన ఆరోపించారు.