01-02-2026 03:13:26 AM
మర్రిగూడ (నాంపల్లి), జనవరి 31 (విజయక్రాంతి): తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించింది ఓ మహిళ. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆమె చేతిలో ఉన్న ఆరు నెలల చిన్నారి దవాఖానలో చికిత్స పొం దుతూ మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొం డ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో శనివారం జరిగింది. కేతెపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ల నగేష్ యాదవ్, మమత దంపతులు. వీరికి ఆరు నెలల బాబు అద్విక్ ఉన్నాడు.
అయితే నగేశ్‌కు అదే గ్రామానికి చెందిన వంపు సుజాత అనే మహిళతో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నది. ఈ విషయం మమతకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తమ మధ్య సంబంధానికి మమత అడ్డుగా ఉందని భావించిన సుజాత ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో నగేశ్ తో కలిసి సుజాత పథక రచన చేసింది. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం సుజాత ఉక్రోషంతో మమత ఇంటికి వచ్చింది.
అదే సమయంలో మమత తల్లిగారి ఊరైన మర్రిగూడ మండలం సరంపేటలో జరుగుతున్న లక్ష్మీ నరసింహ స్వామి జాతరకు వెళ్లేందుకు సిద్ధమై తన కుమారుడు అద్విక్‌కు పాలు పడుతున్నది. ఇదే అదునుగా భావించిన సుజాత చిన్నారితో ఉన్న మమతపై దాడికి పాల్పడింది. అనంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను తల్లీబిడ్డలపై పోసి నిప్పంటించింది.
మంటలతో శరీరం కాలిపోతుంటే కాపాడాలంటూ కాపాడంటూ మమత కేకలు వేస్తూ బయటకు పరుగు తీసింది. చుట్టుపక్కల వాళ్లు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. తీవ్ర గాయాలతో మమత అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడు అద్విక్‌ను నల్లగొండ ఆసుత్రికి తరలించగా చికిత్స పొందు తూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
విషయం తెలుసుకున్న నాంపల్లి సీఐ దూదిరాజు, ఎస్సు లింగారెడ్డిలు గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. మమత మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నాంపల్లి పోలీసులు తెలిపారు. అయితే మృతురాలి భర్త నగేష్, సుజా తలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా సుజాత తన కూతురుకి నగేష్‌తో వివాహం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది.