రైతులకు సరిపడా యూరియా కట్టలు అందించాలి
బేషరతుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాలి
అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం AIKS జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం
పాల్వంచ,(విజయక్రాంతి): రైతులకు సరిపడా యూరియా కట్టలు అందించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం డిమాండ్ చేశారు. సోమవారం రైతాంగ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తహసిల్దార్ కు డిమాండ్స్ తో కూడిన మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు రైతులకు శాపంగా మారాయన్నారు. రైతాంగానికి వ్యవసాయ సీజన్ ప్రారంభ దశలో సరిపడినన్ని ఎరువులు, విత్తనాలు, బ్యాంకు రుణాలు అందించకుండా రైతుకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేస్తూ దోపిడీ వ్యాపారులకు, కార్పొరేటు కంపెనీ యజమానులకు అనుకూలంగా చట్టాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతులకు శాపంగా మారిన యూరియా యాప్ ను రద్దుచేసి రైతులకు సరిపడా యూరియాను ఇవ్వాలని. రెండు లక్షల రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని. అడ్డగోలుగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ,ఎరువుల ధరలను తగ్గించాలని. అన్ని రకాల సన్న వరి ధాన్యం మద్దతు ధరతో కొనుగోలు చేసి బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.






