22 June, 2026 | 6:07 PM

తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించాలి: సీపీఐ

22-06-2026 04:54 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ, అఖిల భారత కిసాన్ సంఘం పిలుపు మేరకు ఆదివారం ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ మండల సమితి, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎరువుల ధరల పెంపును నియంత్రించాలని, రైతు భరోసా నిధులను జూన్ 30లోపు రైతుల ఖాతాల్లో జమ చేయాలని, రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, యూరియా యాప్‌ను రద్దు చేయాలని, నకిలీ  విత్తనాలు, పురుగుమందులు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కె.సారయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరి కారణంగా సాగు వ్యయం పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సరైన సహాయం అందక రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పేద ప్రజలపై భారం పెరిగిందని, ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవరకొండ శంకర్, మండల కార్యదర్శి బొప్పిశెట్టి సత్యనారాయణ, ఏఐకేఎస్ మండల కార్యదర్శి దారావత్ రాందాస్, తిరక్‌నగర్ ఉపసర్పంచ్ షేక్ ఖాసిం, బంటు యాదగిరి, ఆలేం రాఘవేంద్రరావు, పీరయ్య, ఏనప వెంకన్న, కలవల రాజారాం, శరత్, షేక్ నసీమ్ తదితరులు పాల్గొన్నారు.