01-02-2026 03:18:46 AM
సస్పెండ్ చేయాలని ఉద్యోగుల డిమాండ్
సిద్దిపేట, జనవరి 31 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాపురెడ్డి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని విజయక్రాంతి వెలుగులోకి తెచ్చింది. ‘మహిళలపై వైద్యుడి లైంగిక వేధింపులు’ శీర్షికన శనివారం కథనం ప్రచురితం కావడంతో స్పందించిన జిల్లా అధికారులు శనివారం విచారణ జరిపారు. డాక్టర్ వై నిర్మల ఆధ్వర్యంలో ఏర్పాటైన అధికారుల బృందం శనివారం నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఉద్యోగులు, డాక్టర్‌తో సమావేశమయ్యారు.
అంతకుముందు డాక్టర్ బాపురెడ్డి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాబ్జీ నారాయణరావుపేట ఆసుపత్రిని సందర్శించి విచారణ జరిపారు. మహిళా రోగులు, సిబ్బంది ఉద్యోగులు ఇలా ఎవరిని వదలకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బాపురెడ్డి తీరుపై గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాపురెడ్డిని సస్పెండ్ చేయాలంటూ పలువురు ఉద్యోగులు డిమాండ్ చేశారు. సిబ్బంది తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బాపురెడ్డి వివరించారు. కాగా మహిళా ఉద్యోగికి జరిగిన అన్యాయాన్ని నివేదిక రూపంలో అందించాలని శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.