29 April, 2026 | 3:25 AM

ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

29-04-2026 01:33 AM

సురభి మెడికల్ కాలేజీలో ’షీ టీం’ అవగాహన 

సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 28: సోషల్ మీడియాలో వేధింపులు, సైబర్ బెదిరింపులు, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురభి మెడికల్ కాలేజీలో సిద్దిపేట షీ టీం  భారీ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్, ఏహెచ్టీయూ, త్రీటౌన్ ఇన్స్పెక్టర్లు ఏబీ దుర్గ, మల్లేశంగౌడ్, లక్ష్మీబాబు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

సమాజంలో వివిధ రకాల వివక్షలు, సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్త్రీ, పురుషుల మధ్య ఉండే సామాజిక వ్యత్యాసాలు, మహిళలపై చూపే వివక్ష వల్ల కలిగే నష్టాలను వివరించారు. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల హింసలు, వాటిని అరికట్టే చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఎవరైనా వేధింపులకు గురైనా లేదా ఆపదలో ఉన్నా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100 లేదా సిద్దిపేట షీ టీం నంబర్(8712667434) ను సంప్రదించాలని సూచించారు. షీ టీం సిబ్బంది మమత, కానిస్టేబుళ్లు లక్ష్మీనారాయణ, ప్రవీణ్, వైద్య విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.