20 July, 2026 | 7:51 PM

శేఖర్ కార్టూన్లే ఉద్యమానికి ఊపిరి

20-07-2026 01:34 AM
  1. శేఖర్ ప్రస్థానం నేటితరం కార్టూనిస్టులకు స్ఫూర్తి
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి) : తెలంగాణ ఉద్యమ సమయంలో కార్టూనిస్ట్ శేఖర్ గీసిన కార్టూన్లు ప్రజల్లో చైతన్యం రగిలించాయని, ఆయన ప్రస్థానం నేటి తరం కార్టూనిస్టులకు స్ఫూర్తిదాయకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం ఆదివా రం సోమాజిగూడ ప్రెస్‌క్ల్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరై పురస్కారాలు అందజేశారు.

కార్టూన్ విభాగంలో కార్టూనిస్ట్ ఎం. నారు, ఆర్టిస్టు విభాగంలో చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ అవార్డులు అందుకున్నారు. ఈ సం దర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయ జీవితంలో ప్రతిరోజూ విమర్శలు, ప్రతి విమర్శల మధ్య గడుపుతున్న తమకు ఇలాంటి ఆహ్లాదకరమైన సాహిత్య, కళావేదికల్లో పాల్గొనడం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులతో మమేకమయ్యే అవకాశాలు అరుదుగా వస్తాయని, అలాంటి సందర్భాలు పాత జ్ఞాపకాల ను, ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తాయని చెప్పారు.

‘ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం’ అనే సూక్తిని ప్రస్తావిస్తూ, సమాజం, రాజకీయాలపై కార్టూన్లు చూపే ప్రభావం ఎంతో గొప్పదన్నారు. భారతదేశంలో ఆర్‌కే లక్ష్మణ్ వంటి మహోన్నత కార్టూనిస్టులు చూపిన మార్గం చిరస్మరణీయమని, అంతర్జాతీయంగా బిల్ వాటర్సన్ సష్టించిన క్యాల్విన్ అండ్ హాబ్స్ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. తెలుగులో ఈనాడు శ్రీధర్, సాక్షి శంకర్ వంటి కార్టూనిస్టుల ప్రతిభను ప్రశంసించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మాగాంధీ విలువలు, ఆయన చూపిన సిద్ధాంతాల అవసరం దేశానికి మరింత పెరిగిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మత విశ్వాసాలు ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనవేనని, పరస్పర గౌరవంతో ముందుకు సాగడం సమాజానికి అవసరమని పేర్కొన్నారు. జీవితంలో గెలుపు, ఓటములు సహజమని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయడ మే ప్రజాప్రతినిధుల కర్తవ్యమని కేటీఆర్ అన్నారు.

శేఖర్ కుటుంబ సభ్యులు, మిత్రులు గత ఆరేళ్లుగా ఆయన స్మారకార్థం అవార్డులను అందించడం అభినందనీయమన్నారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు కార్టూనిస్టుగా శేఖర్ విశిష్ట సేవలు అందించారని తెలిపారు. శేఖర్‌ను వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాలేదు న్నారు.

అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లు ఆమోదమైన రోజున గన్‌పార్క్‌కు వెళ్లి తెలంగాణ సాధనను చూసి ఆనందించిన సంఘటన తనను కదిలించిందని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి శేఖర్ మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవం మరింత ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.