calender_icon.png 13 December, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘లక్ష’ణంగా షెల్టర్లు..!

10-12-2025 12:17:58 AM

  1. లక్షలు పెట్టి నిర్మించారు..లక్షణంగా వదిలేశారు..

సూర్యాపేట - జనగామ హైవేపై రూ.1.50 కోట్లతో బస్సు షెల్టర్ల ఏర్పాటు 

నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో శిథిలం 

మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తేవాలంటున్న ప్రయాణికులు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 9:  ప్రయాణికులకు ఎక్కడ ఆటంకాలు కలవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు లక్షలు వెచ్చించి బస్సు షెల్టర్లను ఏర్పాటు చేస్తాయి. అయితే వాటి అధికారులు వాటిని సక్రమంగా నిర్వహించక లక్షణంగా వదిలేయ డంతో ప్రస్తుతం అవి ఉపయోగించలేని విధంగా మారిపోయాయి. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం రోడ్లపైనే వేచి ఉండా ల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

సూర్యాపేట-జనగామ 365(బీ)జాతీయ రహదారిపై ఇటు వంటి పరిస్థితి నెలకొంది. రోడ్డు  విస్తరణలో భాగంగా రోడ్డు వెంట నిర్మించిన బస్సు షెల్టర్లు ధ్వంసమై పోయాయి. ఈ షెల్టర్ల నిర్మాణంలో నాణ్యత లోపించి ఎక్కడికక్కడ తుప్పుపట్టాయి. చాలా చోట్ల షెల్టర్ల రేకులు వంగిపోయి, విరిగిపోయాయి. ప్రస్తుతం షెల్టర్లు ప్రయాణికులు కూర్చోలేని విధంగా తయారయ్యాయి.

ప్రయాణికులకు పనికి రాకుండా..

సూర్యాపేట-జనగామ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సూర్యాపేట నుండి తిరుమలగిరి వరకు 45 కిలోమీటర్ల పొడవునా 25 వరకు బస్సు షెల్టర్ లను హైవే వెంట గ్రామాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించారు.ఇందుకోసం సుమారు 1.50 కోట్లు ఖర్చు చేశారు.

2018లో ఈ బస్సు షెల్టర్ల నిర్మాణం జరిగింది. జాతీయ రహదారి విస్తరణ చేపట్టిన కేపీసీ కంపెనీ వారే బస్సు షెల్టర్ లను నిర్మించారు.కానీ తర్వాత వాటి నిర్వహణను వదిలేశారు. ప్రస్తుతం ఆ కంపెనీ కాలపరిమితి కూడా పూర్తయింది.పాడైన బస్సు షెల్టర్లను వెంటనే మరమ్మత్తులు చేయించి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

బస్సు షెల్టర్లు ఉపయోగించలేని విధంగా మారాయి

సూర్యాపేట-జనగామ హైవేపై గ్రామాల వద్ద రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన బస్సు షెల్టర్లు పూర్తిగా తుప్పు పట్టి పాడైపోయాయి. బస్సు షెల్టర్ల పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో ప్రయాణికులు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎండకు, వానకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హైవే అధికారులు వెంటనే స్పందించి వీటి స్థానాల్లో కొత్త బస్సు షెల్టర్లు నిర్మించాలి.

- వజ్జె వినయ్ యాదవ్, రామన్నగూడెం