ఇమ్రాన్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి
- రెండురోజుల్లో ఇస్లామాబాద్ ఫిఫా ఆస్పత్రిలో చేర్చాలి
- చికిత్స కోసం ప్రత్యేక మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి
- పాకిస్థాన్ సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు
- కుమారులతో ఫోన్‌లో మాట్లాడేందుకు కోర్టు అనుమతి
- విచారణ సెప్టెంబర్ ౧౬ వరకు వాయిదా
ఇస్లామాబాద్, ఆగస్టు ౧౮: పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్‌సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ఖాన్‌కు అక్కడి అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఉపశమనం లభించింది. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలు జీవితం అనుభవిస్తున్న ఇమ్రాన్‌ఖాన్‌ను రెండు రోజుల్లో ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య చికిత్స కోసం ప్రత్యేకం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.
అలాగే, విదేశాల్లో ఉంటున్న కుమారులతో ఇమ్రాన్‌ఖాన్ ఫోన్‌లో మాట్లాడవచ్చనే వెసులుబాటు, కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించేందుకు కూడా కల్పించింది. తదుపరి విచారణ సెప్టెంబరు 16కి వాయిదా పడింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. అప్పటివరకు ఇమ్రాన్‌ఖాన్ ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోనున్నారు. 73 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్ ప్రస్తుతం రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలతో సతమతమవుతున్నారు.
న్యాయస్థానం తీర్పుపై పీటీఐ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌కు స్వతంత్ర వైద్యుల సమక్షంలోనే చికిత్స జరగాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వైద్య సంరక్షణ పేరుతో ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాలు చేయకుండా న్యాయస్థానం అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, పార్టీ శ్రేణులు పిఫా ఆస్పత్రి వద్ద ఎలాంటి నిరసనలు చేయవద్దని పార్టీ నేతలు, మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఇమ్రాన్‌ఖాన్‌పై నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని, ఆయా కేసుల నుంచి ఆయన విముక్తి పొందే వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ప్రధానమైన అభియోగాలివీ..
ప్రధానిగా కొనసాగిన సమయంలో అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలతో 2023లో ఇమ్రాన్‌ఖాన్ అరెస్టయ్యారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ఇమ్రాన్‌ఖాన్ భారీగా లబ్ధి పొందారని, దేశానికి సంబధించిన కోట్లాది రూపాయలను దారి మళ్లించారని ఆయనపై ఉన్న ప్రధాన అభియోగం. అలాగే, విదేశీ పర్యటన సమయాల్లో వివిధ దేశాధినేతల నుంచి ఆయన ఖరీదైన బహుమతుల పొందారని, దేశంలో హింసాకాండ ప్రేరేపించారనేపై ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలోని పాక్ రాయబారి పంపిన రహస్య దౌత్య పత్రాన్ని రాజకీయ లబ్ధి కోసం బహిర్గతం చేశారనే అభియోగమూ ఉంది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం విడాకుల తర్వాత పాటించాల్సిన నిరీక్షణ కాలం (ఇద్దత్) పూర్తికాకముందే, ఆయన మరో వివాహం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి.






