మూడు రాష్ట్రాలకు ముగ్గురు బీజేపీ కొత్త ఇన్‌చార్జులు
ఉత్తరప్రదేశ్ బాధ్యుడిగా వినోద్ తావ్డే
పంజాబ్ బాధ్యుడిగా సతీష్ పునియా
గుజరాత్ బాధ్యుడిగా తరుణ్ చుగ్ నిమాయకం
పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ ఉత్తర్వులు
న్యూఢిల్లీ, ఆగస్టు ౧౮: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తన కొత్త జాతీయ కార్యవర్గ కమిటీని ప్రకటించిన మరుసటి రోజు మంగళవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్‌కు పార్టీ కొత్త ఇన్‌చార్జులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా వినోద్ తావ్డే, పంజాబ్ ఇన్‌చార్జ్‌గా సతీష్ పూనియా, గుజరాత్ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చుగ్ నియమితులయ్యారు. ఈ నియామకాలు తక్షణం అమలులోకి వస్తాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఆ మూడు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కీలక రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతోనే అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపటినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేడర్‌ను బలోపేతం చేయడం కోసం అనుభవజ్ఞులైన నేతలకు బాధ్యతలు అప్పగించిందని స్పష్టం చేస్తున్నాయి. వీరి సారథ్యంలో ౩ రాష్ట్రాల్లో కేడర్ పటిష్టమవుతుందని భావిస్తున్నాయి.
వ్యూహకర్త వినోద్ తావ్డే
వినోద్ తావ్డే బీజేపీలో దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. మహారాష్ట్రకు చెందిన 63 ఏళ్ల ఈ నేత రాష్ట్రంలో ఓబీసీ నేతగా గుర్తింపు పొందారు. గతంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీలో ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలు మితిమీరడం, పార్టీ బలం సడలటంతోనే అధిష్ఠానం ఆ రాష్ట్రానికి బాధ్యునిగా తావ్డేను నియమించింది.
ట్రబుల్ షూటర్ సతీష్ పూనియా
రాజస్థాన్‌కు చెందిన సతీష్ పూనియా బీజేపీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభసభ్యుడు. గతంలో ఈయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యహరించారు. పార్టీ కేడర్‌ను రాష్ట్రంలో మరింత బలపరిచారు. క్షేత్రస్థాయిలో ఉండి పనిచేస్తూ, క్యాడర్‌ను ఉత్తేజపరచడం, క్యాడర్‌తో సమర్థంగా పనిచేయించడం సతీష్ మార్క్ పనితీరు. మొత్తంగా ఈయనకు ట్రబుల్ షూటర్ అనే పేరుంది.
క్రియాశీలక నేత తరుణ్ చుగ్
పంజాబ్‌కు చెందిన తరుణ్ చుగ్ దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పార్లమెంట్ సభ్యుడు. గతంలో ఆయన బీజేపీ కేంద్ర కార్యాలయ బాధ్యతలను నిర్వర్తించారు. అనేక రాష్ట్రాలకు పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా పనిచేశారు. పార్టీ కేడర్‌ను క్రమశిక్షణతో నడిపించడంలో ఈయనకు గట్టి పట్టు ఉందని నాయకత్వం భావిస్తున్నది. అందుకే ఆయన్ను పార్టీ గుజరాత్ ఇన్‌చార్జిగా నియమించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌లో విజయం సాధించేందుకు అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇక వ్యూహరచనే తరువాయి.






