ట్యాంక్‌బండ్‌పై 100 అడుగుల శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలి
శివసేన రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ
ముషీరాబాద్,సెప్టెంబర్1(విజయక్రాంతి: ట్యాంక్‌బండ్‌పై 100 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకార శివాజీ డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా భక్తులు, అభిమానుల విరాళాలతో విగ్రహ నిర్మాణానికి నిధులు సమీకరించవచ్చన్నారు.
ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తే శివసేన ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణ బాధ్యత చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హుస్సేన్సాగర్ పేరును ‘వినాయక్ సాగర్’ గా మార్చి, ట్యాంక్బ్ంప వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
గణేష్ మండపాల వద్ద సెప్టెంబర్17న జాతీయ జెండాను ఎగురవేసి, బాలగంగాధర్ తిలక్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సుధాకర్, హైదరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ సూర్యవంశి రమేష్, యువసేన రాష్ట్ర కార్యదర్శి జంపుల సాయికుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సురేష్ సాబ్నే తదితరులు పాల్గొన్నారు.






