మల్లారెడ్డికి మళ్లీ షాక్!
వారం తిరక్కుండానే మరో వివాదం
వెలుగులోకి బొమ్మరాసిపేట పెద్దచెరువు
ఎఫ్‌టీఎల్‌లో ప్రహరీ నిర్మాణం
అధికారులకు స్థానికుల ఫిర్యాదు
జేసీబీతో కూల్చేసిన అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (విజయక్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి మల్లారెడ్డి భూ ఆక్రమణలను ఒక్కొక్కటిగా తవ్వి తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుచిత్ర వ్యవహారం బట్టబయలు కాగా, తాజాగా మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని పెద్ద చెరువు ఆక్రమణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక్కడ సర్వే నంబర్ 315, 407, 48లో మల్లారెడ్డికి సుమారు 6 ఎకరాల భూమి ఉంది. దాని పక్కనే ఉన్న పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆయన అక్రమంగా ప్రహరీ నిర్మిం చారని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆ ప్రహరీని శుక్రవారం నేలమట్టం చేశారు.
వరుస వివాదాలు
* ఇటీవల పేట్ బషీరాబాద్‌లోని సర్వే నంబర్ 82లో ఎకరానికి పైగా స్థలం వివాదాస్పదమైంది. పోలీస్‌స్టేషన్‌దాకా వెళ్లాల్సి వచ్చింది. చివ రకు అధికారులు వచ్చి సర్వే చేపట్టారు. ఇంకా ఈ సర్వే ఫలితాలను అధికారులు వెల్లడించలేదు. ఈ వివాదంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కూడా హల్ చేసిన సంగతి తెల్సిందే. అయితే, సర్వే నంబర్ 82లో తనకు ఎకరం 29 గుంటల భూమి ఉందని మల్లారెడ్డి చెబుతుండగా, అందులో తమది 33 గుంటల భూమి కలిసిపోయిందని బాధితులు చెప్తున్నారు.
* కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామం సుచిత్ర పరిధిలో సర్వే నంబర్ 82, 83లోని స్థలం విషయంలోనూ మల్లారెడ్డికి మరికొందరికి మధ్య భూ వివాదం సాగుతున్నది. రెండున్నర ఎకరాల భూమి తమదని మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి వాదిస్తుండగా, అందులో 1.11 ఎకరాల భూమి తమదేనని మరో 15 మంది చెబుతున్నారు. అయితే, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి వివాదస్పద డైలాగ్‌లతో నిత్యం వార్తలలో ఉండేవారు. అధికారం కోల్పోయిన తర్వాత రోజుకో భూ ఆక్రమణ వ్యవహారంతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు.






