15 August, 2026 | 4:42 PM

అచ్చంపేటలో భగ్గుమన్న పాతకక్షలు

25-05-2024 12:24 AM

నాగర్‌కర్నూల్, మే 24 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పాతకక్షలు భగ్గుమన్నాయి. పది రోజుల క్రితం కర్రలతో పరస్పర దాడులకు దిగిన ఇరువర్గాలు, తాజాగా శుక్రవారం పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసుకున్నారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని రెండోవార్డు కౌన్సిలర్ సుంకరి నిర్మల భర్త బాలరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఈయనకు ఇదేకాలనీకి చెందిన లాలూయాదవ్‌కు తరచూ గొడవలు జరుగుతుండేవి. కొద్దిరోజుల క్రితం ఇదే విషయంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. లాలూయాదవ్ వర్గీయులు కర్రలతో బాలరాజు వర్గంపై దాడి చేశారు.

దీంతో బాధితుడి ఫిర్యాదు, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు లాలూయాదవ్‌తో పాటు ఆయన వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బెయిల్‌పై వచ్చిన లాలూయాదవ్‌పై బాలరాజుతో పాటు మరో ఇద్దరు కత్తులతో దాడి చేశారు. ఘటనలో లాలూయాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడిని ఆసుపత్రిలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పరామర్శించారు. బాలరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.