కోమాలో కామారెడ్డి దవాఖాన
కామారెడ్డి, మే 24 (విజయక్రాంతి) : సమయపాలన పాటించని డాక్టర్ల వల్ల కామారెడ్డి పెద్ద దవాఖానలో వైద్యసేవలు కోమా స్థితికి చేరుకున్నాయి. ఉదయం 9 గంటలకు వైద్యులు రావాల్సి ఉండగా, 10 గంటలకు కూడా వస్తారో లేదో అనే డైలమాలో రోగులు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఒకవేళ వచ్చినా డాక్టర్ల కంటే సిబ్బంది, నర్సులే హంగామా చేస్తూ రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రోగుల అసిస్టెంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలుచుంటే ఆలస్యంగా వచ్చిన డాక్టర్లు గంట సేపు కూడా ఉండకుండా వైద్య సేవల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. రోజు ఓపీ విభాగానికి 600ల నుంచి 800 మంది వరకు వచ్చే రోగులు డాక్టర్ల కోసం నిత్యం ఎదురుచూడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ వైద్యుల తీరు ఇలా ఉంటే, మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీలు, పట్టణాల్లోని బస్తీ దవాఖానల్లో వైద్యుల తీరు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.






