‘షాక్’ కొట్టే నిజాలు!?
- విద్యుత్ శాఖలో ఉద్యోగుల నకిలీ సర్టిఫికెట్లు
- దూరవిద్య లేని కాలేజీల పట్టాలను ఎలా ధ్రువీకరించారు?
- సంగారెడ్డి నకిలీ సర్టిఫికెట్ల సంఘటనతో వెలుగులోకి కొత్త విషయాలు
సంగారెడ్డి, జూన్ 4 (విజయక్రాంతి): తెలంగాణ సదరన్ డిస్కమ్ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) పరిధిలో తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పలు జిల్లాల్లో అర్హత లేని కొందరు వ్యక్తులు నకిలీ విద్యారత, అనుభవ ధృవీకరణ పత్రాలతో ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో చలామణి అవుతున్నారనే ఆరోపణలపై ఇటు ప్రభుత్వ వర్గాలు, అటు నిఘా సంస్థలు దృష్టి సారించాయి.
సంగారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖలో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల భాగోతంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా 2010 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన కొన్ని యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లు పొందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఒకరు ఇద్దరు కాదు పలు రకాలుగా ఆర్థిక లబ్ది చెందిన వారి సంఖ్య భారీ సంఖ్యలోనే ఉంటుందని తెలుస్తోంది.
ఒకే శాఖ కావడం కలిసొచ్చిందా?
విద్యుత్ శాఖలో ఉద్యోగం వచ్చాక అరతకు సంబందించిన సర్టిఫికెట్లు అసలా నకిలీయా అని నిర్ధారించేందుకు ఆయా కాలేజీలకు యూనివర్సిటీలకు పంపుతారు. ఇందులో నిజంగా సెలవు పెట్టి చదివి ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఆయా కాలేజీల నుండి నిర్ధారణ వస్తుందని పైఅధికారులకు వదిలేస్తారు.
ఎక్కడైతే కొనుగోలు చేసి తెచ్చిన సర్టిఫికెట్లు ఉంటాయో వారు మాత్రం అదే శాఖకు చెందిన సదరు అధికారులను మెప్పించి తామే ఆయా విద్యాసంస్థలకు వెళ్లి జెన్యూనిటీ తెస్తామని తీసుకెళ్తుంటారు. ఇందులో కొందరు చదివిన కాలేజీలు ఉండవు కానీ జన్యూనిటీ మాత్రం వస్తుంది. అది ఎలా తెచ్చారో అనేది తెచ్చిన వారికే తెలుస్తుంది. సహజంగా ఒకే శాఖ కావడంతో వారిపై సంబంధిత అధికారులకు అనుమానం వచ్చే అవకాశం లేదు. ఇదే పెట్టుబడిగా చాల మంది నకిలీని అసలుగా మార్చేశారని తెలిసింది.
శాఖాపమైన అనుమతి లేకుండానే..
విద్యుత్ శాఖలో ముఖ్యంగా తెలంగాణ సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో 2010-2014 వరకు తెలంగాణ రాష్ర్టం రాకముందు భారీగా పలు యూనివర్సిటీల నుండి సర్టిఫికెట్లు వచ్చినట్టు తెలిసింది. వీటిని ఉద్యోగ మార్పిడి కోసం ఎక్కువగా వినియోగించినట్టు సమాచారం. ఉన్న అర్హతతో పొందిన సదరు ఉద్యోగులు కరెస్పాండెన్స్ ద్వారా సాంకేతిక, అకాడమిక్ చదువులు చదివి కొత్తగా వేరే పోస్టుకు మారుతుంటారు.
ఇందులో జెఎల్‌ఎం కానీ ఏఎల్‌ఎమ్ కానీ జూనియర్ అసిస్టెంట్ గా మారాలంటే కనీస అరత డిగ్రీ ఉండాలి. అలాగే సబ్ ఇంజనీర్ పోస్టులోకి రావాలంటే డిప్లొమా ఇంజీనిరింగ్ చేసి ఉండాలి. ఇలా ఆయా అరతలు సంపాదించడానికి సదరు ఉద్యోగులు శాఖాపరమైన అనుమతి పొందాలి. పరీక్షల సమయంలో ఏఅర్న్డ్ లీవ్ పెట్టాలి. కానీ కొందరు ఉద్యోగులు సెలవులు పెట్టకుండానే పట్టా సంపాదించడం ఇక్కడ వింత విషయం.
కోర్సులేని కాలేజీల్లో పట్టాలు
విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్ కీలకమైన పోస్ట్. అలాంటి పోస్టుకు కన్వర్షన్ అయ్యే ఓ అండ్ ఎం కార్మికులకు ప్రమోషన్లలో ప్రత్యేక కోట ఉంటుంది. అందుకే అటు వైవు కన్వర్షన్ కావడానికి చాల మంది ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే 2010-2014 వరకు కొందరు కోర్స్ లేని కాలేజీల నుండి పట్టా పొందినట్టు తెలిసింది. సదరు వ్యక్తులు ఆ పట్టాలను జన్యునిటీ కూడా తెచ్చారంటే ఎంత మేర పక్క ప్రణాళికతో వెళ్లారనేది అర్థమవుతోంది.
కరీంనగర్ కేంద్రంగా అడ్డా
తెలంగాణ ఏర్పాటుకు నాలుగేళ్ళ ముందు నుండి తెలంగాణ ఏర్పాటయ్యే వరకు కరీంనగర్ కేంద్రంగా కొన్ని స్టడీ సెంటర్ల సాక్షిగా ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం సాగినట్టు అర్థమవుతోంది. అక్కడ వెలిసిన స్టడీ సెంటర్ నిర్వహకులు లక్షల్లో వసూలు చేసి కొందరికి సర్టిఫికెట్లు అప్పజెప్పినట్టు సమాచారం. అయితే 2014 వరకు కొందరు ఉద్యోగులు పొందిన సర్టిఫికెట్లలో నకిలీ ఉండటానికి అప్పట్లో ఆన్లున్ రిజిస్ట్రేషన్ విధానం లేకపోవడమే కారణమైంది. దీంతో స్టడీ సెంటర్ రిజిస్ట్రేషన్ ఆధారంగా యూనివర్సిటీ జాబితా ఉండేది. ఐతే అలాంటి పరిస్థితుల్లో జాబితాను సైతం ఎప్పటికప్పుడు స్టడీ సెంటర్ వాళ్ళ అవసరాన్ని బట్టి మార్చే వీలుంటుంది. ఇదే కొందరికి చదవకుండా, రాయకుండా పట్టాలు పొందేందు కు కారణమైందని తెలుస్తోంది.






