5 June, 2026 | 2:16 AM

విద్యుత్ కోసం రెండేళ్ల నిరీక్షణ..

05-06-2026 12:56 AM

అధికారుల నిర్లక్ష్యానికి గుండ్లమడుగు బలి!

చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న గ్రామ ప్రజలు

పాల్వంచ, జూన్ 4, (విజయక్రాంతి): పాల్వంచ మండలం ఉలవనూరు-లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుండ్లమడుగు గ్రామ ప్రజలకు విద్యుత్ సౌకర్యం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మారింది. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, నేటికీ విద్యుత్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

గ్రామానికి విద్యుత్ కనెక్షన్ కల్పిస్తామని చెప్పిన విద్యుత్ శాఖ అధికారులు సుమారు రూ.6 వేల చలానా వసూలు చేసినప్పటికీ, రెండేళ్లు గడిచినా ఒక్క కరెంటు పోల్ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ‘డబ్బులు తీసుకోవడానికే వేగం... పని చేయడంలో మాత్రం జాప్యమేనా?‘ అంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు. విద్యుత్ అధికారులు మాత్రం అటవీ శాఖ నిరభ్యంతర ధృవీకరణ పత్రం (NOC) లేకపోవడమే కారణమని చేతులు దులుపుకుంటుండగా, అటవీ శాఖ అధికారులు కూడా ఫైళ్లను ముందుకు కదపకపోవడంతో గ్రామ ప్రజలు రెండు శాఖల మధ్య నలిగిపోతున్నారు.

రెండు సంవత్సరాలుగా ఫారెస్ట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా NOC మంజూరు కాకపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను రెండుసార్లు తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రజల ప్రాథమిక అవసరమైన విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడంలో అధికారులు  విఫలమయ్యారు.  గ్రామస్థుల ఇబ్బందులను పట్టించుకునే నాథుడు లేడా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని విద్యుత్, అటవీ శాఖల మధ్య సమన్వయం సాధించి గుండ్లమడుగు గ్రామ ప్రజలకు విద్యుత్ వెలుగులు అందించాలనీ గ్రామస్తులు  డిమాండ్ చేస్తున్నారు.