నమ్మక తప్పని నిజాలు

30-04-2024 12:10:00 AM

కొన్ని విషయాలను మనం జీర్ణించుకోలేం. 

అయినా నమ్మక తప్పదు. 

మొసళ్లను తిన్న పక్షి

చరిత్ర పూర్వయుగానికి చెందిన ‘షూబిల్స్’ అనే పెద్ద పక్షి ఏకంగా మొసలి పిల్లల్ని చంపి తినేసింది. కత్తివంటి దాని పెద్ద ముక్కుతో పొడిచి మరీ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఇదేదో చిన్నసైజు పక్షి కాదు. మనిషి అంత ఎత్తు పెరిగింది. చూస్తేనే భయమేసేలా తయారైంది. సాధారణంగా ఇవి చేపలు, పాకుడు జంతువులనే ఆహారంగా తీసుకొంటాయి. మొసలి పిల్లల్ని తినడం చాలా అరుదు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పక్షులు అయిదడుగుల (15. మీటర్లు) పొడుగు వరకూ పెరగడమూ సహజమే. దీని ముక్కు ఒక్కటే ఒక అడుగు పొడుగు వుంటుంది. దీనిని ప్రపంచలోనే మూడో అతిపెద్ద పక్షిగా చెబుతున్నారు. 

ఈ రకం పక్షులను వేల్‌బిల్, వేల్ హెడెడ్ స్టార్క్, షూ బిల్డ్ స్టార్క్ వంటి పేర్లతో పిలుస్తుంటారు. చూడటానికి కొంగలా వున్నా కాళ్లు, ముక్కు పెద్దవిగా వుంటాయి. తూర్పు ఆఫ్రికాలోని ‘మార్షెస్’ చిత్తడినేల ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తుంటాయి. ఒక పరిశోధన మేరకు ఇవి క్యాట్‌ఫిష్‌లనే ఎక్కువగా తింటాయని 2015లోనే వెల్లడైనట్టు ‘జర్నల్ ఆఫ్ అఫ్రికన్ ఆర్నిథాలొజీ’లో ఇటీవల ప్రచురితమైన వ్యాసం పేర్కొంది. 71 శాతం వరకూ వీటి ప్రధాన ఆహారం చేపలే. అయితే, అప్పుడప్పుడూ తిమ్మిరి చేపలు, పాములు, పిల్ల మొసళ్లను సైతం ఆరగిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

ఆ హిప్పో మగది కాదు, ఆడది!

జపాన్‌కు చెందిన ‘ఒసాకా’ నగరంలోని ‘టెన్నోజి’ జంతు ప్రదర్శనశాలలో ఒక చిత్రం జరిగింది. ‘జెన్ చాన్’గా పిలిచే ఒక ‘మగ’ హిప్పో (హిప్పోపోటమస్‌ః నీటి ఏనుగు) ‘నిజానికి మగది కాదు, ఆడదని’ తేలింది. అది కూడా ఏడేళ్ల తర్వాత ఈ విషయం వెలుగుచూసింది. 2017లో మెక్సికోకు చెందిన ‘ఆఫ్రికన్ సఫారీ’ నుండి అయిదేళ్ల వయసుండగా దానిని జూకు తెచ్చారు. అప్పుడు దానిని ‘మగది’గానే నమ్మారు. డాక్యుమెంట్స్‌లోనూ మగ హిప్పోగానే పేర్కొన్నారు. అంత చిన్న వయసులో దాని సాధారణ ప్రవర్తన తీరుతెన్నులనుబట్టి ఆ మేరకు నిర్ధారించినట్టు జూ అధికారులు చెబుతున్నారు. 

పునరుత్పాదక అవయవం కూడా వారి కంటికి కనిపించక పోవడం మరో సమస్యగా ఉండింది. అనుమానం వచ్చిన తర్వాత దాని లింగ నిర్ధారణ కోసం వేరే పరిశోధనా సంస్థలో డిఎన్‌ఏ పరీక్ష జరిపించారు. దీని ఆధారంగా దానిని ‘ఆడ హిప్పో’గా నిర్ధారించుకున్నారు. ‘మున్ముందు ఇలాంటి అపోహలకు తావు లేకుండా జాగ్రత్తగా తమకు ఈ అనుభవం ఉపకరిస్తుందని’ జూ అధికారులు అంటున్నారు.

న్యూట్రినోల మహా వేగం

భూమిమీద అత్యంత వేగంగా ప్రయాణించేవి కాంతి కిరణాలు లేదా శబ్ద తరంగాలుగా మనం ఇప్పటి వరకూ భావిస్తున్నాం. కానీ, వీటికి మించిన అసాధారణ వేగంతో ప్రయాణించేవీ కణాలూ వున్నాయి. అవే న్యూట్రినోలు, ప్రోటాన్లు! వీటిని మన సాధారణ నేత్రాలతో చూడలేం. కానీ, వీటి వేగం అనూహ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు.  ఒక ప్రోటాన్ కంటే 10 బిలియన్ రెట్లు చిన్నగా వుండే న్యూట్రినో కణాలు మహావేగంతో ప్రయాణిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోదసి నుంచి మన కంటికి కనిపించని అనేక రకాల అతిసూక్ష్మకణాలు భూమ్మీదికి అత్యంత వేగంగా నిరంతరం వస్తుంటాయి. వాటిలో కాంతి వేగం సెకనుకు 1,86,00 మైళ్లు (3,00,000 కి.మీ.). నిజానికి విశ్వంలో దీన్ని మించిన వేగం మరి దేనికీ లేదు. ప్రోటాన్స్ ద్రవ్యరాశికంటే 1000 కోట్ల రెట్ల చిన్నవిగా న్యూట్రినోలను చెబుతున్నారు. దీన్నిబట్టి అన్నింటికంటే ఎక్కువ వేగం న్యూట్రినోలదే అని వారు తేల్చారు.