సర్వశాస్త్ర స్వరూపిణి భగవద్గీత

30-04-2024 12:10:00 AM

భగవద్గీత కల్పవృక్షం వంటిది. సంకల్ప రహితమైన మోక్షస్థితిని ప్రసాదించేది. గీత కామధేనువు వంటిది. కామవర్ణితమైన నిష్కలంక నిర్యాణ పదవిని సమకూర్చేది. గీత చింతామణి వంటిది. చింతలన్నింటినీ పోగొట్టి నిశ్చింత, నిరాపేక్ష, నిరామయ పరంధామానికి జీవుణ్ణి చేర్చేది. గీత అమృతం వంటిది. జనన మరణ రహితమైన శాశ్వత బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించే జ్ఞానామృతమిది. ‘నువు నాశరహితమైన ఆత్మవే కాని, దేహానివి కావన’్న విశ్వాసాన్ని కలిగించే అభయ శాస్త్రం గీత. ఫలరహిత, కర్తవ్యనిష్టను నేర్పేది. భవసాగరాన్ని అవలీ లగా దాటించే నావ. జీవిత రథాన్ని ఒడుదొడుకులు లేకుండా సవ్యంగా నడిపించే రథసారధి. జ్ఞానాన్ని దివ్యగర్జనతో మోహనిద్ర నుండి మేల్కొలి పేది. ఉపనిషత్తులనే గోవులనుండి శ్రీకృష్ణుడు అనే గోపాలుడు పాలు పిండి, వ్యాసమహర్షిద్వారా మహాభారతమనే పాత్రలో నింపిన అమృతధార. తాపత్రయాలను చల్లార్చి మనసుకు శాంతిని అందిస్తుంది. అంతేకాదు, మోక్షద్వారాల తాళం చెవులను జిజ్ఞాసువు చేతికి అందించే బ్రహ్మవిద్య.

ఎవరెవ్వరు ఎన్నెన్ని అర్థాలు లాగి నా, ఎన్నెన్ని భాష్యాలు రాసినా, ఇంక నూ అనంత జ్ఞానం దానిలో మిగిలే ఉంటుంది. మహాత్ములు గీతను మధిం చి ద్వైత పరంగా కొందరు, విశిష్టాద్వైత పరంగా మరికొందరు, అద్వైత పరంగా ఇంకొందరు.. జ్ఞానపరమైన అర్థాలను తెలుపుతూ వారి భావాలను వెల్లడిస్తున్నారు. అయినా, గీతలో ఎంతో విజ్ఞాన భాండాగారం ఇంకా మిగిలే ఉన్నది. ఇదే గీత విశిష్టత. ఇంతటి శక్తి మరే ఇతర గ్రంథాలకూ లేదు. గీతను సంపూర్ణంగా తెలుసుకున్న వారు శ్రీకృష్ణుడు ఒక్కడే. మిగిలిన వారికి గీత ఒకానొక అంశం మాత్రమే.

శోకరాహిత్య ఆనంద ప్రాప్తి గీత లక్ష్యం. ఆనందానుభవానికి మార్గం చూపడమే గీత పని. గీత ప్రాణికోటికి పెన్నిధి. ఉపనిషత్తులు అనే తోటలో నుండి ఆధ్యాత్మిక సత్యాలుగా పిలిచే పుష్పాలతో కూర్చిన మాల భగవద్గీత. మనలను పరమానంద పదవికి గొనిపోయే అపూర్వ సాధనం ఇది. శరీర వృద్ధికి తల్లి పాలు ఎంతగా తోడ్పడుతాయో, బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. గీత జ్ఞానజలంలో ఒక్కసారి స్నానం చేస్తే సంసార మాలిన్యమంతా తొలగిపోతుంది. విష్ణువు ముఖం నుండి వెలువడిన గీత గంగోదకాన్ని ఒక్కసారి త్రాగితే పునర్జన్మ వుండదు. నిరాశ నిస్ప్రహలతో కూడిన వారికి ఉత్సాహం కలిగిస్తుంది. ఆపదలో వున్నవారి వీపు తట్టి, వారి హృదయాలలో ధైర్యాన్ని నింపుతుంది. అందుకే, గీత సర్వశాస్త్ర స్వరూపిణి!

కలకుంట్ల జగదయ్య